
- గట్లు తొలగించకుండా టెంపరరీ ఏర్పాట్లు చేస్తున్నాం
- హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్
ఎల్కతుర్తి, వెలుగు : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పూర్తయిన వెంటనే కాల్వలను పునరుద్ధరించే బాధ్యత తమదేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ చెప్పారు. రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి పెద్దవాగు, దేవాదుల కాల్వలను పూడ్చి వేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ మేరకు సోమవారం బహిరంగ సభా స్థలం వద్ద మీడియాతో మాట్లాడారు. సభ నిర్వహణ కోసం రైతుల సహకారంతో 1200 ఎకరాలకుపైగా భూములు తీసుకున్నామన్నారు.
రైతులకు చెప్పకుండా గెట్లు తొలగించలేదని, సభ కోసం తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేశామని చెప్పారు. పనుల్లో భాగంగా అక్కడక్కడా కాల్వలను పూడ్చివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సభ పూర్తయిన తర్వాత తామే దగ్గరుండి కాల్వలను పునరుద్ధరిస్తామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.