- నేడు మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా..
వరంగల్, వెలుగు : మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేతలు పుల్లా పద్మావతి భాస్కర్ దంపతులు బీఆర్‍ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‍రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్.రాజశేఖర్‍రెడ్డి హయంలో పుల్లా దంపతులు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బీఆర్‍ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సైతం రేవంత్‍రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. 54వ డివిజన్ కార్పొరేటర్ గుంటి రజిత శ్రీనివాస్, 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్ పుప్పాల ప్రభాకర్ కారు పార్టీని వీడారు.
కాంగ్రెస్‍లోకి.. నేడు మరో ఇద్దరు కార్పొరేటర్లు
గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని మరో ఇద్దరు గులాబీ పార్టీ కార్పొరేటర్లు నేడు హైదరాబాద్‍లో సీఎం రేవంత్‍రెడ్డి సమక్షంలో పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. శనివారమే చేరిక ఉండాల్సి ఉండగా వాయిదా పడింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆధ్వర్యంలో 55,56వ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రజిత శ్రీనివాస్, సిరంగి సునీల్ పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరితోపాటు ఇదే నియోజకవర్గానికి చెందిన మరో గిరిజన కార్పొరేటర్ పేరు సైతం వినపడుతోంది.