బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ రాజీనామా!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి రాజీనామా చేశారు. ఇటీవల, బిఆర్ఎస్ పార్టీ  భద్రాచలం నియోజక వర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి అకస్మాత్తుగా తొలగించింది. దీంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో  దీంతో  అసంతృప్తితో ఉన్న బాలసాని బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం(అక్టోబర్ 15) బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కెసిఆర్ కు లేఖ పంపారు. 

కాగా,  బాలసాని లక్ష్మీనారాయణ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1987, జూలై 20వ తేదీన తొలిసారిగా పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1987 నుండి వరుసగా మూడుసార్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ గా ఎన్నికై, 1995, ఆగస్టు 10న డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1990లో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.  1995 నుంచి 2004 వరకు తొమ్మిదిన్నరేళ్లపాటు ఆయన  డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 

తర్వాత 1997-- నుంచి 2000 వరకు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, 2004 నుంచి- 2009 వరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. రెండుసార్లు టీడీపీ తరఫున బాలసాని ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభల్లో అడుగుపెట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థీ పువ్వాడ నాగేశ్వర్‌ రావుపై 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.  ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.