ముషీరాబాద్,వెలుగు : రాష్ట్రంలో చేనేత కార్మికులు కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య ఆకలి చావులకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. చేనేత సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి, కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా కార్మికులను చైతన్యపరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
దీనిలో భాగంగా డిసెంబర్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు వనం శాంతి కుమార్, గంజి మురళీధర్ కూరపాటి రమేశ్, కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం, లక్ష్మీ నరసయ్య, డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.