నా కాళ్లు మొక్కి లీడర్లయినోళ్లు విమర్శలు చేస్తున్రు : కొండా మురళీ

నా కాళ్లు మొక్కి లీడర్లయినోళ్లు విమర్శలు చేస్తున్రు : కొండా మురళీ
  • నేనేప్పుడూ అజంజాహి మిల్‍ కార్మికుల పక్షమే 
  • భూములు పంచడం తప్పితే..కబ్జాలు, కమీషన్లు తెలియదు
  • వరంగల్ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ 

వరంగల్‍, వెలుగు:  నేనేప్పుడూ అజంజాహి మిల్‍ కార్మికుల పక్షమే. గతంలోనూ వారికోసం పోరాడినా. ఇప్పుడు అలానే కొట్లాడుతా. మా కుటుంబానికి పేదల బాగు కోరేలా ఊరూరా భూములు పంచడం తప్పితే కబ్జాలు, కమీషన్లు తెలియవు. నా కాళ్లు మొక్కి లీడర్లుగా ఎదిగినోళ్లు ఇప్పుడు నాపై అనవసర విమర్శలు చేస్తున్నారు” అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ వ్యాఖ్యానించారు. వరంగల్‍ తూర్పు సెగ్మెంట్ లో అజంజాహి మిల్‍ ఏరియాలో 12 గుంటల వివాదాస్పద స్థలంలో ఇటీవల వ్యాపారవేత్త నమశ్శివాయ షాపింగ్‍మాల్‍ కు భూమి పూజ చేయగా.. దానికి కొండా మురళీ హాజరవడం చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆయన గురువారం ప్రెస్‍మీట్‍ నిర్వహించి మాట్లాడారు. 

నా రాజకీయ శత్రువులైన కేటీఆర్‍, కవిత, సంతోష్​రావుకు భయం చెప్పేందుకే.. వారి సన్నిహితుడైన వ్యాపారి నమశ్శివాయ తన సాయం కోరితే దగ్గరకు తీశాను. వరంగల్‍ సిటీలో మాల్‍ నిర్మించి 10 వేల మందికి ఉపాధి కల్పిస్తానని ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. అది మిల్లు కార్మికులు పోరాటం చేస్తున్న వివాదాస్పద స్థలమని నాకు తెలియదని’’. ఆయన వివరించారు. కబ్జాలపై బీఆర్‍ఎస్‍ ఉన్నప్పుడే కేటీఆర్‍తో విభేదించినట్లు గుర్తుచేశారు. అజంజాహి మిల్‍ భూముల జోలికెళ్లిన నాటి కుడా చైర్మన్‍ చెరుకుపల్లి శ్రీనివాస్‍రెడ్డి మొదలు ఇప్పటి కొందరి నేతల వరకు దెబ్బతిన్నారన్నారు. గత పాలకులు సెంట్రల్‍ జైల్‍ను కూల్చారని, ప్రమాదకర పెట్రోల్‍ గోదామ్ ల పక్కన కలెక్టరేట్‍ నిర్మాణం చేపట్టేలా తప్పుడు పర్మిషన్లు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వివాదాస్పద స్థలంపై వెంటనే విచారణ చేయాలని వరంగల్‍ తహసీల్దార్‍ ఇక్బాల్‍, అధికారులకు సూచించారు. కబ్జా అంశాన్ని సీఎం రేవంత్‍రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.  ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకుండే. సొంత డబ్బులతో కార్మికుల సంక్షేమం కోసం జాగా కొనుగోలు చేసి వారు శుభకార్యాలు చేసుకునేలా కమ్యూనిటీ హాల్‍ కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వివాదాస్పద స్థలం సర్వే పూర్తయ్యేదాకా ఎలాంటి నిర్మాణాలు చేసినా చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు.