కరీంనగర్, వెలుగు : కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్ లో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. కాంగ్రెస్ లో చేరాలని చాలా మంది సూచించగా.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కొందరు కోరారు.
ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ బలం పెరుగుతుందని మరికొందరు చెప్పారు. బీఎస్పీలో చేరితే స్వాగతిస్తామని, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి విశ్వం ప్రకటించారు. ఎంఐఎం నాయకులు సయ్యద్ వాహజొద్దీన్, మాజీ ఎంపీపీ సమిండ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కిసాన్ సంఘ్ నాయకుడు జోగినినపల్లి సంపత్ రావు తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన మాతృ సంస్థకు సేవ చేసినట్లే అని అన్నారు.
చివరగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ ఆదేశాల ప్రకారం పని చేస్తానని స్పష్టం చేశారు.