బీజేపీ ఉద్యమకారుల పార్టీ..టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ

బీజేపీ ఉద్యమకారుల పార్టీ అయిందని.. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, స్వామి గౌడ్ వంటి ఉద్యమకారులంతా బీజేపీలోకి వచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ది నిరంకుశ పాలన అని మండిపడ్డారు. టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు..వ్యక్తి స్వామ్యం మాత్రమే ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అభిమానం అంటే బానిసత్వం అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బానిసలు కారని...అభిమానాన్ని బానిసత్వం అనుకుంటే పొరపడినట్లే అని చెప్పారు. కేసీఆర్కు ఓట్లు, సీట్లు, నోట్లే కావాలని..ఈ విషయాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పారని బూర నర్సయ్యగౌడ్ గుర్తు చేశారు.

డబ్బా కొట్టుకోవడంలో కేసీఆర్ ఫస్ట్..

తెలంగాణ వచ్చాకే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పోయిందంటూ..టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని బూర నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. మరి ఫ్లోరైడ్ అంతమైతే..ఫ్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ ఎందుకని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ అంతం అయినట్లుగా టీఆర్ఎస్ నేతలు సొల్లు కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్లో తక్కువ ఖర్చుతో ఫ్లోరైడ్ను నిర్మూలించారని..దీనిపై టీఆర్ఎస్ మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తక్కువ ఖర్చులతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ చేయదని.....మనమంతా మెగా ప్రాజెక్టులే కదా అని ఎద్దేవా చేశారు.
 
ప్రగతి భవన్ లోకి రావాలంటే వీసా కావాలా..?

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయమని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో భూ నిర్వాసితులను 6 ఏండ్లుగా కేసీఆర్ గోసపెట్టారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక రావడం వల్లే  భూ నిర్వాసితులు కేసీఆర్కు గుర్తుకు వచ్చారని చెప్పారు. గతంలో గట్టుప్పల్ మండలం కావాలని నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ  ఉప ఎన్నిక వస్తుందనే గట్టుప్పల్ను మండలం చేశారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం అయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలను ఈజీగా కలిసేవారని..కానీ..ఇప్పుడు ప్రగతిభవన్లోకి వెళ్లాలంటే వీసా కావాలా ? అని ప్రశ్నించారు. 

రాజకీయ రాజసూయ యాగం

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసినా బీజేపీదే విజయమని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మునుగోడే కాదు...వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు సహకరిస్తున్న పోలీసులు, అధికారులు తర్వాత జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి వరదల్లా చేరికలుంటాయన్నారు. బీజేపీలో పోస్టర్ అంటించే బాయ్ ప్రధాని కాగలడని...ఆఫీసు అటెండర్ కేంద్రమంత్రి కాగలడని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ రాజసూయ యాగం నిర్వహిస్తామన్నారు. ఇంటింటికి వెళ్లి బీజేపీకి, టీఆర్ఎస్కు తేడాను వివరిస్తామన్నారు.