ప్రజలు ఆశీర్వదిస్తే ప్రశ్నించే గొంతునవుతా.. : వినోద్​కుమార్​

గంగాధర, వెలుగు: రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి  గెలిపిస్తే  ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు. బుధవారం గంగాధర మండల బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలతో మధురానగర్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి మరో ఏక్​నాథ్​షిండేలా మారేలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. 

తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని మాట్లాడడం హాస్యాస్పదమని, దానిని రాహుల్​గాంధీ ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, యాసంగి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తాను కరీంనగర్​ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశానని, రైల్వేలైన్ తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఒక్క నవోదయ స్కూల్, ఒక్క గుడికి ఫండ్స్ కూడా తేలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు సుంకె రవిశంకర్, నారదాసు లక్ష్మణ్​రావు, జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మండల అధ్యక్షుడు నవీన్​రావు పాల్గొన్నారు.