- మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు : కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటనలో దోషులకు మరణశిక్ష వేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ సంఘటనను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిందన్నారు.
అక్కడి ప్రభుత్వం నిందితుల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని విమర్శించారు. జూనియర్ డాక్టర్ ను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ గూండాలు హాస్పిటల్ పై దాడిచేసి సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
సీసీటీవీ ఫుటేజీని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారన్నారు. మమత ఆధ్వర్యంలో బెంగాల్ లో అరాచక పాలన సాగుతోందన్నారు.