- ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించే ఛాన్స్
- సెకండ్ లిస్ట్‌లో నల్గొండ
- తెరపైకి గంగడి మనోహర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోకసభ సీట్లకు గాను తొలి జాబితాలో భువనగిరి క్యాండిడేట్‌ను ప్రకటించే చాన్స్ఉంది. ఇక్కడ నుంచి ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నా సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నేడోరేపో ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. భువనగిరి, నల్గొండ ఎంపీ స్థానాలకు సంబంధించి పార్టీ రాష్ట్ర కమిటీ ఇదివరకే షార్ట్ లిస్ట్ పంపింది.
గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఈ లిస్ట్ పై చర్చ చర్చించి విభేదాలకు తావులేకుండా ఏకాభిప్రాయం వచ్చిన అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటిస్తారని సీనియర్లు చెప్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు స్టేట్ కమిటీ పంపిన లిస్ట్‌లో భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు గంగడి మనో హర్ రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు పేర్లున్నట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి బీసీ, రెండోది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ ఆలోచన చేస్తోంది.
ఈ నేపథ్యం లో బీసీ కోటా కింద బూర నర్సయ్యగౌడ్ పేరు దాదాపు కొలిక్కివచ్చినట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నల్గొండ ఎంపీ టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్లు బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ల తోపాటు బీజేపీ నుంచి సీనియర్లు నూకల నర్సింహారెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్, పెరిక సురేశ్, మన్నెం రంజిత్ యాదవ్ టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టనుంది. మార్చి 10 తేదీలోగా రెండో లిస్ట్ ప్రకటిస్తారని, ఆ జాబితాలో నల్గొండ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారని పార్టీ సీనియర్ నేత చెప్పారు.
నల్గొండ సీటు రెడ్లకే...?
నల్గొండ ఎంపీ సీటు రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని సీనియర్లు రాష్ట్ర పార్టీకి సూచించారు. ఈ మేరకు పలువురు సీనియర్లు ఢిల్లీ స్థాయిలో తమ వంతు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న మనోహర్ రెడ్డిని నల్గొండ నుంచి పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలిసింది. భువనగిరితో పోలిస్తే నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో పార్టీ బలంగా ఉండటం, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో నల్గొండ పైనే ఆశలు పెట్టుకుంది. అదీగాక అయోధ్యలో శ్రీరాముడి గుడి కట్టినందున ఆ ప్రభావం అర్బన్ ఓటర్ల పైనే ఎక్కువ ఉంటుందని భావిస్తోంది.
భువనగిరితో పోలిస్తే నల్గొండ ఎంపీ పరిధిలో అర్బన్ ప్రాంతం ఎక్కువ. నల్గొండ, దేవర కొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట పాత మున్సిపాలిటీల్లో బీజేపీ ఓటింగ్ పైనే పార్టీ హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. గత రెండు ఎన్నికల్లో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే పార్టీకి మెజార్టీ ఓట్లు పోలవుతాయ ని సీనియర్లు అంచనా వేస్తున్నారు.
అయితే పార్టీలో టికెట్ ఆశిస్తున్న సీనియర్లతోపాటు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నల్గొండలో పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్ పేర్లు పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.