టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు . 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీసీలను వివక్షకు గురి చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌పై బూర అసంతృప్తి వెళ్లగక్కారు. అభిమానానికి బానిసత్వానికి చాలా తేడా ఉందని.. తనకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని విమర్శించారు. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని..మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా తనతో సంప్రదింపులు జరపలేదన్నారు. సమాచారం ఇవ్వకుండానే మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని.. నిజయోకవర్గ స్థాయి సభలు, సమావేశాలకు ఆహ్వానించలేదన్నారు.
తాను వ్యక్తిగతంగా అవమానపడ్డనంటూ బూర నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. 2019 ఎన్నికల్లో నా ఓటమి వెనుక అంతర్గత కుట్ర ఉందని..కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. బీసీలకు టికెట్ పరిశీలించమని అడగడం కూడా నేరమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆరడుగుల జయశంకర్ విగ్రహం పెట్టలేదంటూ తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
కొంతకాలం నుంచి అసంతృప్తిగా బూర నర్సయ్య
2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా బూర నర్సయ్యగౌడ్ గెలిచారు. తిరిగి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే బూర నర్సయ్య గౌడ్ ను ఓడించారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి కూడా బూర నర్సయ్యగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రతీ సమయంలో తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు.
మునుగోడు టిక్కెట్ ఆశించిన బూర నర్సయ్య
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కువగా ఓసీ నేతలే గెలిచారని.. ఈ సారి టీఆర్ఎస్ నుంచి టికెట్ బీసీకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టికెట్ ఆశించడంలో కూడా తన గళం గట్టిగా వినిపించారు. మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ మీటింగులకు పిలువడం లేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవాళ అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి!
బూర నర్సయ్య గౌడ్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ నిన్న పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయ్యారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరితే.. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మునుగోడులో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.