మానకొండూరు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలి : బూర నర్సయ్య గౌడ్

గన్నేరువరం: వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చారిత్రకమని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి లో నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గ మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి అనేక సాహసోపేత నిర్ణయాలను తీసుకొని, అమలు చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని కొనియాడారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను బీజేపీ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం లో కాషాయపు జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ , జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు దరువు ఎల్లన్న, గడ్డం నాగరాజు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.