నాలుగేండ్లలో మహిళలపై దాడులు పెరిగినయ్‌

నాలుగేండ్లలో మహిళలపై దాడులు పెరిగినయ్‌
  •     మోదీ ప్రభుత్వంలో మహిళలు ఆకలితో కాలం వెళ్లదీస్తున్నరు
  •     మాజీ ఎంపీ బృందాకారత్‌
  •     కొత్తగూడెంలో ప్రారంభమైన ఐద్వా రాష్ట్ర మహాసభలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మోదీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి మహిళలు సగం కడుపు ఖాళీగా ఉంచుకొని జీవిస్తున్నారని మాజీ ఎంపీ, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ విమర్శించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాలుగో మహాసభలు సోమవారం కొత్తగూడెంలో మొదలయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూర్యా ప్యాలెస్‌ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో బృందాకారత్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతాయన్నారు.

నాలుగేండ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. లైంగిక వేధింపులపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పెట్టబడిదారులు, బడాబాబులకు పన్నుల్లో రాయితీలు, మతోన్మాదం, మనువాదం అనే త్రిశూల్‌ విధానాన్ని మోదీ సర్కార్‌ అవలంభిస్తోందని ఆరోపించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు కనీస  వేతనం కూడా అందడం లేదన్నారు. సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాను ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేందుకు కుట్ర చేస్తోందన్నారు. దేశంలో ఒక్క శాతం ఉన్న ధనవంతులు 40 శాతం సంపదను కంట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

ఐద్వా నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ మరియం ధావలే మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, లోన్ల పేర మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. గ్రామీణ మహిళలకు ఉపాధి పథకం అందని ద్రాక్షగానే మారిందన్నారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే. శ్రీమతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నేతలు పుణ్యవతి, అరుణ జ్యోతి, టి.జ్యోతి, సుధా సుందర్‌ రామన్‌, బుగ్గవీటి సరళ, డి. సీతాలక్ష్మి, ఎం. జ్యోతి పాల్గొన్నారు.