కరీంనగర్ : మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, ఇక్కడి పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కూడా ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కరీంనగర్, మానకొండూరులో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే చెబుతారంటూ మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ చేపట్టిన "పల్లెగోస- బీజేపీ భరోసా" పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరీంనగర్, మానకొండూరులో పర్యటించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కాసేపు బుల్లెట్ బండి నడిపి కార్యకర్తల్లో జోష్ నింపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంట బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.
మూడు ఎకరాల భూమి అడగకపోయినా.. హామీ ఇచ్చి దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు దళితబంధు పథకం పేరుతో అదే మోసం జరుగుతోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లుగానే మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విద్య, వైద్య రంగాలపై అతి తక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం కేసీఆర్.. లోయర్ మానేరు డ్యామ్ భూ నిర్వాసితులకు ఎందుకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందించలేదని ప్రశ్నించారు.