హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులు తమ తల్లుల పుస్తల తాళ్లను తాకట్టు పెట్టి కోచింగులు తీసుకుని ఏండ్ల తరబడి ప్రిపేర్ అయ్యారని.. ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేస్తే వారి పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రశ్నించారు. పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలనే దుర్మార్గమైన డిమాండ్ తో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లే ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసం నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని..నిరుద్యోగులు పరీక్షలు రాసేందుకు రెడీ అవుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలని అనడంలో కుట్ర కోణం దాగి ఉందని చెప్పారు. పరీక్షలు వాయిదా వేస్తే కొందరు ఫీజుల పేరుతో నిరుద్యోగుల రక్తం తాగుదామని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులుగా మారిన బీఆర్ఎస్ నాయకులు.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.