
తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ ..దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. ప్రధాని మోడీకి మేలు చేయడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ పార్టీతో ఒరిగేదేమి లేదన్నారు. కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో మద్దతు ఇచ్చే పార్టీలను దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే నితీష్ కుమార్, శరద్ పవార్, స్టాలిన్లను కేసీఆర్ కలిశారని..వీరంతా యూపీఏ భాగస్వామ్య పార్టీ నాయకులే అని చెప్పారు. కేసీఆర్ మోసగాడని శరద్ పవార్ గతంలోనే చెప్పాడన్నారు.
బీజేపీని బలోపేతం చేసేందుకే జాతీయ పార్టీ
కేసీఆర్ దరిద్రపు ముఖ్యమంత్రి అని మధుయాష్కీగౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాకు అడ్డాగా కేసీఆర్ మార్చాడని మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను బలహీన పర్చేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెంటుకుంటాయని అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మునుగోడులో బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ ..తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ పేర్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని మధయాష్కీగౌడ్ అన్నారు. గిరిజనలకు రిజర్వేషన్లు ఇస్తామని వారం గడిచినా..వాటి ఊసెత్తడం లేదన్నారు. గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్..రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.