
- ఎల్బీనగర్ డీసీపీ ఫుల్ టైమ్ ల్యాండ్ సెటిల్‌మెంట్లు..
- పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నడు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ ల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లలో వాస్తవం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో యాష్కీ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎల్బీ నగర్ డీసీపీ ఫుల్ టైమ్ ల్యాండ్ సెటిట్‌మెంట్లు చేస్తాడని, పార్ట్ టైమ్ మాత్రమే లా అండ్ ఆర్డర్ ఉద్యోగం చేస్తున్నారని ఆరోపించారు. డీసీపీ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన మారితే మంచిదని, లేదంటే చర్యలు తప్పవన్నారు. ‘భూ వివాదం విషయంలో డీసీపీ.. డాక్యుమెంట్లు తీసుకొని రావాలని ఆదేశించడం ఏమిటి? పోలీసులకు ల్యాండ్ డాక్యుమెంట్లతో పనేంటి?’ అని ప్రశ్నించారు.
జైపూర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ తన కులం ఏమిటో చెప్పారని, జాతీయ జెండా తన మతం అని స్పష్టం చేశారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గాడి తప్పిన బండిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. అలాంటి వారు మంత్రి పదవికి అనర్హులని చెప్పారు. కేంద్ర మంత్రిగా సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కుల గణనపై బీజేపీ నేతలు తమ వైఖరి చెప్పకుండా తప్పించుకునేందుకు రాహుల్ కులంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్, కవిత బీసీల గురించి మాట్లాడడమా?
కేటీఆర్, కవిత బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇక అధికారంలోకి రాలేడన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే దళితున్ని సీఎంను చేస్తానంటూ.. కొడుకు, బిడ్డ, అల్లుడిని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రమాణం చేయాలని డిమాండ్‌చేశారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవితకు బెయిల్ రావడం అంతర్గత ఒప్పందంలో భాగమన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయని చెప్పారు. బీసీ సీఎం కావాలంటే తెలంగాణలో ప్రస్తుతం ఆ సీటు ఖాళీగా లేదన్నారు. ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పారు.