- హత్యకు పాతకక్షలు కారణమనడం విచారకరం
- గంగారెడ్డి కుటుంబసభ్యులకు
- కాంగ్రెస్ నేత మధుయాష్కి పరామర్శ
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
జగిత్యాల, వెలుగు : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌తో కలిసి శనివారం గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా.. గంగారెడ్డి హత్యకు పాత కక్షలే కారణమంటూ పోలీసులు తేల్చడం విచారకరమన్నారు.
తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే తెలిపినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందన్నారు. కేసును లోతుగా విచారణ చేయాలని సీఎంతో పాటు డీజీపీని కలిసి కోరుతామన్నారు. కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మధుయాష్కి.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
సొంత లాభం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని పడగొడతామంటూ అభద్రతకు గురిచేసిన ప్రతిపక్షాల తీరు వల్లే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నట్లు మధుయాష్కి చెప్పారు. అలాగని కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి వారు పార్టీలోకి రాలేదని సొంత ప్రయోజనాలతోనే వచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస వచ్చిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తామన్నారు.