హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో ఆ పరిసరాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మూసీ బాధితులకు మాజీ ఎంపీ, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ భరోసా కల్పించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరూ భయంతో ఉండాల్సిన అవసరం లేదని, నిశ్చింతంగా ఉండాలని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఇవాళ (అక్టోబర్ 7) చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలోని సాయిబాబా దేవాలయం వద్ద మూసీ పరివాహక ప్రాంత కాలనీవాసులతో ఏర్పాటుచేసిన సమావేశానికి మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. తాము ఇళ్లు కోల్పోతామేమోనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఎవరూ భయపడవద్దని వారి చేతిలో చేయి వేసి ధైర్యం చెప్పారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ విషయంలో భాగంగా మూసీ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తుందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కాపాడుకుంటుందని పేర్కొన్నారు.
ALSO READ | హైదరాబాద్‌లో MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడి
నగరం లోపల మూసి వేరు.. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ లాంటి శివారు ప్రాంతంలో వేరు అన్నారు. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ ప్రాంతాలలో చాలా విశాలంగా మూసీ ఉందన్నారు. ఇళ్లు కోల్పోకుండా.. ఇళ్లు లేని వైపు ఎక్కువగా భూ సేకరణ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. ప్రజల సందేహాల నివృత్తికి ఇక్కడి ప్రాంత వాసులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు తానే తీసుకెళ్లి మాట్లాడిస్థానని స్పష్టంచేశారు.
నియోజకవర్గ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రజలతో చర్చించకుండా, ఎవరి ఇళ్లు అన్యాయంగా కూల్చరని క్లారిటీ ఇచ్చారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ ప్రాంత చెరువులు, కుంటలు మింగేశారని మండిపడ్డారు. కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు చేపడతామని హెచ్చరించారు. చెరువులను చెరబట్టిన అక్రమార్కులపై విచారణ జరిపించి, అక్రమాలను కక్కించిడం ఖాయమన్నారు.