మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

  • కొన్నాళ్లుగా అనారోగ్యం.. నిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • వరుసగా 4 సార్లు నాగర్​కర్నూల్ ఎంపీగా విజయం
  • ఉద్యమకారుడిగా జగన్నాథం పాత్ర మరువలేనిది: సీఎం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జగన్నాథం వయసు 73 ఏండ్లు. నాగర్ కర్నూల్ జిల్లా (అప్పటి  మహబూబ్ నగర్ జిల్లా)  ఇటిక్యాలలో1951 మే 22న జన్మించిన ఆయన వరుసగా నాలుగుసార్లు నాగర్​కర్నూల్ ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004లో టీడీపీ తరఫున.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే, 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్​ను వీడి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరఫున నాగర్​కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో నాటి కేసీఆర్ సర్కారు ఆయనను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్య ప్రత్యేక ప్రతినిధిగా నియమించి కేబినెట్ హోదా కల్పించింది. 

తండ్రి వాచ్ మ్యాన్, తల్లి అటెండర్.. 

జగన్నాథం నాగార్జున సాగర్‌‌లోని హిల్‌‌కాలనీ ప్రైమరీ స్కూల్​లో 2 నుంచి 4వ తరగతి వరకు చదివారు. 6 నుంచి 8వ తరగతి వరకు ఇక్కడి హైస్కూల్‌‌లో, 9వ, 10వ తరగతులను వరంగల్ జిల్లా సంగంలోని సర్కారు బడిలో చదువుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో పీయూసీ చదివిన ఆయన.. హైదరాబాద్‌‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఇ.ఎన్.టి స్పెషలిస్ట్ సర్జన్ కోర్సు చేశారు. సూర్యాపేటలోని సివిల్ హాస్పిటల్‌‌లో అసిస్టెంట్‌‌ సర్జన్ గా పనిచేశారు. ఏపీఎస్పీ 8వ బెటాలియన్​లో పోలీస్ మెడికల్ ఆఫీసర్‌‌గా సేవలు అందించారు. సికింద్రాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రిలో, హైదరాబాద్‌‌లోని ఈఎన్‌‌టీ ఆస్పత్రిలో ఈఎన్‌‌టీ సర్జన్‌‌గా పనిచేశారు.  జగన్నాథం తండ్రి మందా పుల్లయ్య నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో మెకానికల్ విభాగంలో వాచ్ మ్యాన్​గా.. తల్లి మందా సవరమ్మ ఆఫీస్ అటెండర్​గా పనిచేశారు. 

ప్రముఖుల సంతాపం

మందా జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా మందా జగన్నాథం నిర్వహించిన పాత్ర మరుపురానిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. జగన్నాథం మరణం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్నాథం మృతి పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు కేటీఆర్​, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.