మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‎లోని నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న ఆయన..  ఆరోగ్యం విషమించడంతో 2025, జనవరి 12న తుదిశ్వాస విడిచారు. మంద జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేపు (జనవరి 13) ఆయన స్వస్థలంలో జగన్నాథం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథంకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు పొన్నం ప్రభాకర్,  సీతక్క, దామోదర రాజ నర్సింహా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జగన్నాథంను పరామర్శించి మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

మంద జగన్నాథం నేపథ్యం ఇదే

మంద జగన్నాథం 1951, మే 22న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో జన్మించారు. ఆయన తండ్రి పేరు పెద్ద పుల్లయ్య. జగన్నాథంకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మెడిసన్ చదివిన ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన జగన్నాథం.. ఆ పార్టీ నుండి మూడు సార్లు (1996, 1999, 2004), కాంగ్రెస్ నుండి (2009) ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‎లో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.

 ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో 2023 నవంబరు 17న బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌స‌భ‌ సీటు ఇవ్వకపోవడంతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాజస్థాన్‎లోని ఆళ్వార్‎లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన పాలిటిక్స్‎కు దూరంగా ఉంటున్నారు.