కేసీఆర్‌‌‌‌కు ఎన్నికలకు ముందే స్కీమ్స్‌‌ గుర్తొస్తయ్: పొంగులేటి

  • మాయ మాటలు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు
  • కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపాలనేదే అందరి కోరిక
  • ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించినం.. 
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే వెనక్కి తగ్గినం
  • జులై 2న ఖమ్మంలో భారీ సభ పెడ్తమని వెల్లడి
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతాళానికి, 
  • అవినీతి ఆకాశానికి: జూపల్లి
  • ఢిల్లీలో కాంగ్రెస్‌‌ అగ్ర నేతలతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: మాయ మాటలు చెప్పడంలో, మాటల గారడీలు చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఆ మాయ మాటలతోనే మళ్లీ మూడో సారి కూడా సీఎం కావాలని చూస్తున్నారని చెప్పారు. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, ఇతర కొత్త స్కీమ్‌లను ప్రకటిస్తారని విమర్శించారు. కేసీఆర్ మాదిరి కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పి ఉంటే 2014లో అధికారంలోకి వచ్చేవారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 

సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి దాదాపు 30 మంది నేతలతోపాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. తర్వాత 10 జన్ పథ్‌లో ప్రియాంకా గాంధీని పొంగులేటి, జూపల్లి మర్యాదపూర్వంగా కలిశారు. రేణుకా చౌదరితోనూ పొంగులేటి సమావేశమయ్యారు. ఏఐసీసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ‘‘తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎట్లున్నదో చూస్తున్నం. ఆత్మగౌరవం నిలబడుతుందని తెలంగాణ బిడ్డలు భావించారు. కానీ అదేమి ప్రజలకు దక్కలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి ఆకాంక్షలు నెరవేర్చేలేదు. నీళ్లు, నిధులు నియామక హామీలు నిలబెట్టుకోలేదు” అని ఆరోపించారు. 

ఆరు నెలలు ఎన్నో సర్వేలు చేశాం

‘‘రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆరు నెలల్లో ఎన్నో సర్వేలు నిర్వహించాం. ఉద్యమకారులు, మేధావులు, కులాలు, వర్గాల వారీగా ప్రజా నాడిని తెలుసుకున్నాం. కేసీఆర్‌‌ను ఇంటికి పంపాలనేదే అందరి కోరిక. 80 శాతానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు, కేసీఆర్ మరో వైపు ఉన్నారు” అని పొంగులేటి చెప్పారు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించామని, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కేసీఆర్‌‌కు మేలు జరుగుతుందనే ఆ ఆలోచన విరమించుకున్నాం” అని పొంగులేటి చెప్పారు. భారత్ జోడో యాత్ర, కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుంటే, బీజేపీ అంతర్గత లుకలుకలతో రోజురోజుకు డైల్యూట్ అవుతున్నదన్నారు.

 అన్ని అంశాలపై ఆరు నెలలు చర్చించిన తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యామన్నారు. జులై 2న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో తాను కాంగ్రెస్​లో చేరనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. ఈ సభలో తనతో పాటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇతర జిల్లాల ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరతారన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పేరుతో ఖమ్మంలో నిర్వహించిన సభను చూపి ఆ పార్టీ నేతలు జబ్బలు చరుచుకున్నారని, ఆ సభను మించిన సభ పెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ సభకు వచ్చే జనాన్ని లెక్కించుకోవాలని సవాల్ విసిరారు. జూపల్లి కూడా జులై 14 లేదా 16న మహబూబ్‌నగర్‌‌లో పెట్టే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

బోగస్ మాటలు, జిమ్మిక్కులు చేస్తున్నారు: జూపల్లి

కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశానికి చేరిందని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ‘‘కేసీఆర్ పాలనంతా బోగస్ మాటలు, స్కీమ్‌లతోనే సాగుతున్నది. ఎప్పటికప్పుడు కొత్త స్కీంలు, అంబేద్కర్ భారీ విగ్రహం, అమరవీరుల స్థూపం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు సీఎం అవుతారని ముందుగానే అంబేద్కర్​కు తెలిసి ఉంటే.. రాజ్యాంగంలో మరిన్ని చట్టాలు తెచ్చేవారన్నారు. ‘‘కేసీఆర్​కు మూడోసారి పాలించే నైతిక హక్కు లేదు. ఈసారి కాంగ్రెస్​కు అధికారం ఇవ్వకపోతే.. ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని ఆ దేవుడు క్షమించడు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి’’ అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​లు తెరవెనక ఒప్పందాలతో తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. భేటీలో కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, గుర్నాథ్ రెడ్డి, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, బానోతు విజయా బాయి, రాజా రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ:సైబర్ నేరగాళ్ల వలలో తెలంగాణ

ఘర్‌‌వాపసీ జరుగుతున్నది: రాహుల్

బీఆర్ఎస్ నుంచి 35 మంది తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. కాంగ్రెస్ నేతలందరూ వెనక్కి తిరిగి రావడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు నేతలు వెల్లడించారు. ‘ఘర్ వాపసీ’ జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ‘కేసీఆర్ హఠావో - తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని రాహుల్ సూచించినట్లు వివరించారు.