బీఆర్ఎస్ లో సభ్యత్వమే లేనప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారు..? : పొంగులేటి 

ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకూ నన్ను ఏమీ చేయలేరు : పొంగులేటి

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రెస్ మీట్ నిర్వహించిన పొంగులేటి.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తూనే...పలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పదం అని చెప్పారు. వందల సార్లు బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని తనను పిలిచినా వెళ్లలేదన్నారు. ధైర్యం చేసిన తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. గత వంద రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వ పరిపాలన తీరును ప్రశ్నిస్తున్నానని చెప్పారు. 

పార్టీ ఓటమిపై ఏనాడైనా సమీక్షించారా..? : పొంగులేటి 

తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా, అవమానపర్చినా దిగమింగుకుని ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా.. కేటీఆర్ గురించే బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పారు. ‘ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ ) నుంచి ఒక్క అభ్యర్థే గెలిచారు. 2018 ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఏనాడైనా సమీక్ష చేశారా..? తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై చర్చించారా..?  ఒకవేళ ఓటమిపై చర్చించినట్లైతే.. ఆ సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించారు..? తప్పు మీ పక్కన పెట్టుకుని.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎదుటివారిపై నిందమోపడం ఎంతవరకూ సబబు..? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటినుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఈ విషయం ఎవర్నీ అడిగినా చెబుతారు’ అంటూ పొంగులేటి కామెంట్స్ చేశారు. 

ఎంపీ నామా గెలుపునకు ఎంతో కృషి చేశా : పొంగులేటి 

‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తుల మాటల నమ్మి.. నాకు, నా వాళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన మాట నిజం కదా..? ప్రజలు నన్ను తిరస్కరించలేదు. ప్రజలు నన్ను ఓడించలేదు. నా మొర ఏనాడు మీకు చెప్పుకోలేదు. నామా నాగేశ్వర్ రావును ఎంపీగా గెలిపించేందుకు చాలా కృషి చేశాను. ఆయన్ను నేను గెలిపించలేదా..? ఒకవేళ గెలిపించలేరని మీరు భావించినప్పుడు ఎలక్షన్స్ కు ముందు నాకు ఎందుకు బాధ్యతలు ఇచ్చి ప్రాథేయపడాలి..? నన్ను రెండోవ సారి కూడా మోసం చేసిన మాట వాస్తవం కదా..? ఎన్నికలయ్యాక రాజ్యసభ సీటు ఇస్తానన్న మీరు..ఇవ్వని మాట నిజం కాదా..?  మా కుమారుడి రిసెప్షన్ కు వచ్చిన వేలాది మంది జనాన్ని చూసి.. మీ కళ్లు ఒర్చుకోలేక.. నాకు రాజ్యసభ సీటు ఇస్తే ప్రమాదమని గ్రహించి.. మోసం చేసిన మాట వాస్తవం కాదా..?’ అని ప్రశ్నించారు.

రాజకీయంగా అణగదొక్కాలని చూశారు : పొంగులేటి 

‘రెండోసారి తడిగుడ్డతో ఊచకోత కోసిన మాట నిజం కాదా.? రాజకీయంగా నన్ను సమాధి చేయాలనుకోవడం నిజం కాదా..? నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజల్లో ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ నాకు సంబంధించిన వ్యక్తులకు బీ ఫామ్స్ ఇచ్చారా...? నేను సిఫార్సు చేసిన ఏ ఒక్క వ్యక్తికి కూడా బీ ఫాం ఇవ్వలేదు. రాజకీయంగా నాన్ను సమాధి చేయాలనుకున్నది నిజం కాదా..? ప్రజల్లో గుండెల్లో ఉన్నంత వరకూ నన్ను మీరు ఏమీ చేయలేరు’ అంటూ పొంగులేటి కామెంట్స్ చేశారు. 

https://www.youtube.com/watch?v=UC8GZ9Ci0gE