ఎన్టీఆర్ విగ్రహానికి శతజయంతి.. నివాళులర్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

విగ్రహాన్ని శుద్ధి చేసిన అభిమానులు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్​లో ఉన్న  ఎన్టీఆర్ విగ్రహానికి శతజయంతి సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే, ఎన్టీఆర్ అభిమానులైన గొల్లపూడి హరికృష్ణ, సరిపూడి సతీశ్​మరికొందరు ఎన్టీఆర్ విగ్రహం అపవిత్రమైందంటూ పాలతో శుద్ధి చేశారు. వారు మాట్లాడుతూ ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి, రాజశేఖర్ రెడ్డి పేరును పెడితే అక్కడి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుచరుడని చెప్పుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించలేదన్నారు.

అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ కు ఎలా నివాళులర్పిస్తారని ప్రశ్నించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకేస్తూ కోర్టును ఆశ్రయించిన వాళ్లను వెంటేసుకుని వచ్చి నివాళులర్పించడం ఏమిటన్నారు. ​అందుకే ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసినట్లు చెప్పారు. పొంగులేటి ఏరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దాఖలాలు లేవన్నారు. రాజకీయ లబ్ధి కోసమే నివాళులర్పించడాన్ని ఖండిస్తున్నామన్నారు.