పొంగులేటి దారెటు?..బీజేపీ వైపా.. కాంగ్రెస్​ వైపా.?

  • కొనసాగుతున్న డైలమా..అనుచరులతో చర్చలు
  • బీజేపీలో చేరుతారంటూ కొన్నిరోజులుగా ప్రచారం
  • తమతో టచ్​లో ఉన్నారంటున్న కాంగ్రెస్​ లీడర్లు


హైదరాబాద్​,  వెలుగు: బీఆర్​ఎస్​ అసమ్మతి నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దారెటు..? అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 18నే అమిత్​షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే డేట్​ కూడా ఫిక్సయింది. అయితే, ఆ డేట్​ దాటిపోయినా.. ఆయన బీజేపీలో చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా తమ పార్టీలో చేరాలని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కాంగ్రెస్​ లీడర్లు ఆహ్వానించటంతో డైలమాలో పడ్డారు. తన అనుచరులు, సహచర నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయనతో సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క సంప్రదింపులు జరిపారు. భట్టితో ఆయన టచ్​లో ఉన్నారని, పార్టీలోకి రావాలని ఆహ్వానించామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి బాహాటంగా వెల్లడించారు. ఈ పరిణామాలతో పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్​ కొనసాగుతున్నది. 

జిల్లాపై పట్టున్న నేత కావడంతో..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగే కీలకమైన లీడర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి. సొంత లోక్​సభ నియోజకవర్గంతో పాటు  జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు బలమైన పట్టుంది. అందుకే పొంగులేటి ఏ పార్టీలో చేరినా.. అది ఆ పార్టీకి కలిసొస్తుందనే వాదనలున్నాయి.  పార్టీలో చేరిక వ్యవహారంపై బీజేపీ లీడర్లు ఎలాంటి కామెంట్లు చేయకపోగా, కాంగ్రెస్ లీడర్లు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2014లో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి తర్వాత  టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ ఎక్కువ సీట్లలో ఓడిపోవటంతో పార్టీ నాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019లో ఆయనకు ఖమ్మం ఎంపీ టికెట్​ ఇవ్వకుండా నామా నాగేశ్వర్​రావుకు ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత  పొంగులేటి రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డారు. అప్పట్నుంచీ సీఎం కేసీఆర్​ ఆయనను పక్కకు పెట్టినట్లు చర్చ జరగడటంతో పాటు జిల్లాలో ఉన్న అధికార పార్టీ లీడర్ల మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో ఇటీవల తన అనుచరులు, కార్యకర్తలతో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రత్యేకంగా 
మీటింగ్​లు పెట్టి..  బీఆర్​ఎస్​పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ నిర్వహించిన తొలి బహిరంగ సభకు పొంగులేటి వర్గం దూరంగా ఉంది. దీంతో ఆయన బీఆర్​ఎస్​ను వీడటం ఖాయమని తేలిపోయింది.