కామేపల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ కైవాసం చేసుకుంటుందని పార్టీ ప్రచార కమిటీ కో- చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండలంలో పాతలింగాలలో మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. వెంకటరెడ్డి సోదరుడు, తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చరణ్ రెడ్డిని కలిసి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా రూపొందించిన ప్రణాళికపై చర్చించారు.
అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఘనత రాంరెడ్డి కుటుంబానికే ఉందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకులతో పాటు ప్రతి కార్యకర్తను దివంగత నేత వెంకట రెడ్డి ఎలాగైతే కాపాడుకున్నారో ఇక ముందు కూడా అదే విధంగా కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాకిషోర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు త్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
450 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక
ఖమ్మం రూరల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గురువారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది దుండగుల చేతిలో హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులతో పాటు తెల్దారుపల్లికి చెందిన సుమారు 450 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అనంతరం ఏదులాపురంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్‌ను పొంగులేటి కలిసి మద్దతు కోరారు. పార్టీ పొత్తులపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని సురేశ్ చెప్పారు.
ALSO READ : కాంగ్రెస్ ను బతికించిందే ఆర్యవైశ్యులు : తుమ్మల నాగేశ్వరరావు