
హుస్నాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ గారడి మాటలు, గాలి హామీలు ప్రజలు నమ్మొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఆయనకు వణుకుపుట్టిందన్నారు. అందుకే తమ పార్టీ రూపొందించిన పథకాలను కాపీ కొట్టాడని ఎద్దేవా చేశారు.
2018లో ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలుచేయలేదు ఇప్పుడు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తాడో ప్రజలు ఆలోచించాలన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.4 00 కే ఇస్తామంటున్న కేసీఆర్ ముందుగా 2018 నుంచి ఇప్పటి వరకు గ్యాస్ వినియోగదారుల ఖాతాల్లో మిగితా డబ్బులు జమచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చి పదేండ్లు దాటుతున్నా ఒక్క గ్రూప్-1 పరీక్ష నిర్వహించని అసమర్థుడు కేసీఆర్ అన్నారు.
ఇప్పటి వరకు డీఎస్సీ ఎగ్జామ్ కూడా నిర్వహించలేదన్నారు. ఏ ఎమ్మెల్యేకూ అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఇంటికే వస్తాడని, అలాంటి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు కేడేం లింగమూర్తి, పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పాల్గొన్నారు.