రమేశ్ రాథోడ్​కు తుది వీడ్కోలు..భారీగా తరలివచ్చిన అభిమానులు

  • వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి 
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ 

ఉట్నూర్, వెలుగు: అకాల మృతి చెందిన ఆదిలాబాద్  మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్  రాథోడ్​కు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. ఆదివారం ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్  మండల కేంద్రంలో సంప్రదాయ పద్ధతిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఇంటి నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్ర 12 గంటల వరకు కొనసాగింది. ఉట్నూర్  ప్రధాన రహదారి జనాలతో నిండిపోయింది. 

అంతిమ యాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు. వేలాది జనం తరలిరావడంతో ఉట్నూర్  మొత్తం జనసంద్రంగా మారింది. అనంతరం రమేశ్  వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కు మారుడు రితీశ్.. రమేశ్  చితికి నిప్పంటించాడు. 

ప్రజా సమస్యలపై గళమెత్తారు: బండి

ఉట్నూర్ లోని రాథోడ్ రమేశ్  ఇంటికి తెల్లవారుజామున చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్  ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యలను పరామర్శించారు. రమేశ్  కుమారుడు రితేశ్​తో మాట్లాడి ఓదార్చారు. సంజయ్  మాట్లాడుతూ రమేశ్  తనకు వ్యక్తిగతంగా ఆప్తుడని, పార్టీ ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసేవారని గుర్తుచేశారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో తన వెంట నడిచి ప్రజా సమస్యలపై గళమెత్తారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో రమేశ్  తనదైన ముద్రవేశారని చెప్పారు. అలాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని సంజయ్  పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఆదిలాబాద్  ఎమ్మెల్యే పాయల్  శంకర్  కూడా రమేశ్  అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్  పార్థివదేహంపైన గౌరవసూచకంగా బీజేపీ జెండా  ఉంచారు. అంతిమ యాత్రలో ఆదిలాబాద్  జడ్పీ చైర్మన్ రాథోడ్  జనార్ధన్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్  ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు, బోథ్  ఎమ్మెల్యే అనిల్  జాదవ్, ఎమ్మెల్యే రామరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. కాగా.. రమేశ్  రాథోడ్  మృతికి సంతాపంగా ఆదివారం ఉట్నూర్  వారసంత బంద్  చేశారు. పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛందగా దుకాణాలు బంద్  చేశారు.