
తెలంగాణ ఉద్యమకారుల్లో ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్న అతికొద్దిమందిలో ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ ఒకరు. ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయనకు ఆ తర్వాత ఏ అవకాశం దక్కలేదు. ఇప్పుడు ములుగు సెగ్మెంట్లో ఆయన గురించి పార్టీ నేతల్లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ములుగు సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే చాన్స్ కోసం ఆయన చాలా ఆశలుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా తనవంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. లోకల్ గా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలపై ఆయన కొంత టెన్షన్ పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ములుగు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బీఆర్ఎస్ నేతలకు కొరకరాని కొయ్యగా మారారు. ఫుల్ మెజారిటీ ఉన్నా వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకున్న బీఆర్ఎస్ సీతక్కకు కండువా కప్పడానికి విశ్వప్రయత్నం చేసి ఫెయిలైనట్లు చెబుతారు. దీంతో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆమె టార్గెట్ గా ప్రచారం మొదలుపెట్టారు. ఎస్టీ ఎమ్మెల్యేల్లో సీతక్క ఒక్కరే ఆదివాసీ కోయ వర్గానికి చెందిన లీడర్. దీంతో ఆమెను ఎదుర్కోవడానికి ఆదే వర్గం నుంచి అభ్యర్థిని పెట్టే ప్లాన్ లో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జిల్లా జెడ్పీ వైఎస్ చైర్ పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతి.. నక్సల్ ఉద్యమంలో చనిపోయిన బడే నాగేశ్వరరావు బిడ్డ. ఈమధ్య జిల్లాకు వచ్చిన కేటీఆర్ ఆమెను పదేపదే ప్రశంసించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది.
ములుగు సీటుపై హైకమాండ్ ప్లాన్ నిజమైతే ప్రొఫెసర్ ఆశలు గల్లంతేనని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లోనూ నిరాశే కనిపిస్తోంది. ఎంపీగా రెండోసారి టికెట్ ఇయ్యకుండా అవమానించినా, నమ్ముకొని ఉన్నందుకు ఇదేం పద్ధతి అని లోకల్ లీడర్లు కామెంట్ చేస్తున్నారు. పెద్ద బాస్ ను కలిసే ప్రయత్నంలో ప్రొఫెసర్ ఉన్నట్లు చెబుతున్నారు.
అవమానాలు తట్టుకోలేక ఉద్యమకారులంతా బీఆర్ఎస్ ను వదిలిపెట్టినా ప్రస్తుతం మిగిలి ఉన్న కొద్దిమందిలో ప్రొఫెసర్ నాయక్ ఒకరు. ఎంపీగా ఒకసారి గెలిచాక, రెండోసారి చివరిదాకా చెప్పకుండా, కారణం లేకుండానే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయినా కేసీఆర్ నే నమ్ముకొని ఉన్నారు. ఏ గౌరవం ఇవ్వకున్నా ఏదో కార్యక్రమం చేస్తున్నారు. చివరికి ఆయన పరిస్థితిని చూసి లోకల్ పార్టీ నేతలే సింపథీ చూపిస్తున్నారు. పార్టీలో అందరు ఉద్యమకారుల గతే ప్రొఫెసర్ కూ పట్టిందని కామెంట్ చేస్తున్నారు.