బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైంది : మాజీ ఎంపీ హనుమంతరావు

బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైంది  : మాజీ ఎంపీ హనుమంతరావు
  • రైతులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు

సిద్దిపేట రూరల్, వెలుగు: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. రైతులను బీఆర్​ఎస్​నేతలు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణతో కలసి ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామన్నారు. ఆగస్టు 15లోగా అర్హులైన అందరికీ చేస్తామని, తొందరలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆధార్ కార్డును అప్​డేట్ చేసుకోకపోవడం వల్లే కొంత మంది రైతులకు మాఫీ కాలేదని, మాఫీ కానీ అర్హులైన రైతులను గుర్తించి వారికి మాఫీ అయ్యేలా చూడాలన్నారు.

గతంలో యూపీఏ చైర్​పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నప్పుడు రూ.70 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేస్తే, తమ పార్టీ భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంచిందన్నారు. బీఆర్ఎస్ పది ఏండ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని, తాము 7 నెలలోనే ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టామన్నారు. వద్దన్న వినకుండా కేసీఆర్ తన పేరు కోసం ప్రాజెక్టులను కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు అత్తు ఇమామ్, కలీమోద్దిన్, మంద పాండు, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.