కొత్తపల్లి, వెలుగు: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది బంజారాలేనని, రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎస్టీ సెల్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ను బొంద పెడతాం అని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వీళ్లిద్దరి గురువులు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడుతోనే కాలేదని, వీళ్లతో ఏమవుతుందన్నారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఐదేళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను పట్టించుకోలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయ, బీఆర్ఎస్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు రూప్ సింగ్, మాజీ మేయర్రవీందర్సింగ్, లీడర్లు తిరుపతినాయక్, రవినాయక్, తిరుపతినాయక్, రాజునాయక్, బీలునాయక్, లక్ష్మివీరునాయక్, మంగ, మానస తదితరులు పాల్గొన్నారు.