దళిత బంధు పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ స్కీమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ డప్పుల మోత కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడంలో ముఖ్యమంత్రి నెంబర్ వన్ అన్నారాయన. కేవలం హుజూరాబాద్‌లో ఈటల గెలుపు భయంతో దళితుల ఓట్ల కోసమే దళిత బంధు స్కీం తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ముందుకు వెళ్తామనుకున్నాడన్నారు. సీఎం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తే.. ఇవాళ ఆ భూమి విలువ 50, 60 లక్షల రూపాయల వరకు ఉండేదన్నారు. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు మన పైసలు తీసుకోని మనమీదే రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి దళిత పథకం కింద మనకు రావాల్సిన పది లక్షలు మనం సాధించుకుందాని వివేక్ వెంకటస్వామి అన్నారు. దీంతో పాటు.. మూడు ఎకరాల భూమి కూడా డిమాండ్ చేద్దామన్నారు. ఇంటికొకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని కూడా సీఎం వెంటనే అమలు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు.
ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలంటూ బషీర్ బాగ్ నుంచి డప్పుల మోత కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల మోత ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, విజయశాంతి హాజరయ్యారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్ మాట్లాడుతూ హుజురాబాద్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు చూపిస్తామన్నారు. అలీబాబా దొంగల్లా రాష్ట్రాన్నికేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు.