సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్ల పోరాటానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణిలో వీఆర్ఎస్ డిపెండెంట్లను ఏఐటీయుసీ యూనియన్ మోసం చేసిందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కుటుంబసభ్యులందరి ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వివేక్ వెంకటస్వామి తెలిపారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వీఆర్ఎస్ 1997-2001 డీపెండెంట్ల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సింగరేణి సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి కాపాడారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. అదేవిధంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో కార్మికులకు 28వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చిన ఘనత మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామిదని చెప్పారు.