రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని నేను ఏడాదిన్నరగా చెబుతూ వస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన పాలనలో, ప్రవర్తనలో విపరీత పోకడలను చూశాక నాకు కలిగిన అభిప్రాయం అది. ఇప్పుడు కొద్దినెలలుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి అన్ని పార్టీలవాళ్లు, ప్రజాసంఘాలవాళ్లు కూడా పదేపదే తుగ్లక్ని గుర్తుచేసుకుంటున్నారు. నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం రాకుండా, దాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నందుకు కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. కొన్నేండ్లుగా కేసీఆర్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలు, తప్పుల మీద తప్పులు చేస్తుండడం, తన నిర్ణయాలతో జనం ఎన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం తుగ్లక్ నే గుర్తుచేస్తోంది.
తుగ్లక్ వారసుడిగా నిరూపించుకోవడానికి కేసీఆర్ చేసిన పనులు చెప్పాలంటే పెద్ద పుస్తకమే అవుతుందేమో. ఉదాహరణకు హెల్త్ స్కీం తీసుకుందాం. చాలా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలోనూ అమలుచేస్తామని కేసీఆర్ సర్కారు ఇప్పటికి ఒప్పుకుంది. అయితే అసలు ఇన్నేండ్లలో ఈ స్కీంను ఎందుకు అమలుచేయలేదో ప్రజలకు చెప్పడానికి ఆయన దగ్గర సరైన కారణాలు లేవు. ఆరోగ్యశ్రీనే గొప్ప స్కీం అని చెప్పుకున్న కేసీఆర్ దాన్ని సరిగ్గా అమలుచేశారా అంటే అదీ లేదు. ఆయన బంధువులకు చెందిన ఒక్క హాస్పిటల్ కు తప్ప ఆ స్కీం ఎవరికీ ఉపయోగపడింది లేదు. ఇతర హాస్పిటళ్లు అన్నింటికీ వందలకోట్ల బకాయిలు పెట్టి, ఈ స్కీం మాకొద్దు అనే వరకు తెచ్చారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా అదే తీరు..
కరోనా తీవ్రతతో జనం ప్రాణాల మీదకు వచ్చినా దాన్ని ఆరోగ్యశ్రీ స్కీంలోకి చేర్చలేదు. దీంతో చాలామంది సరైన ట్రీట్ మెంట్ తీసుకోలేక చనిపోతే, వేలాది కుటుంబాలు లక్షలకు లక్షలు అప్పులపాలయ్యాయి. కరోనా ట్రీట్ మెంట్ ను అనుమతిస్తున్న ఆయుష్మాన్ స్కీంను అమలుచేసి ఉంటే కొందరి ప్రాణాలైనా దక్కేవి. అనేక కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఉండేవి. ప్రజలు చచ్చిపోతున్నా నా మూర్ఖత్వమే గొప్పదనుకునే ప్రవర్తనతోనే తుగ్లక్ చరిత్రకెక్కాడు. కేసీఆర్ కూడా అదే బాటలో నడుస్తూ వస్తున్నారు.
హైదరాబాద్ వరదల టైంలో తుగ్లక్ ను గుర్తుచేసే మరికొన్ని ఘోరాలకు కేసీఆర్ పాల్పడ్డారు. నిజానికి హైదరాబాద్ కు 2016లోనే తీవ్రమైన వరదలు వచ్చాయి. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వచ్చిన వరదలకు ప్రాణనష్టం జరగలేదుగానీ సిటీకి చాలా నష్టం జరిగింది. అప్పుడు సిటీ ప్లాన్ గురించి కేసీఆర్ పెద్ద పెద్ద స్పీచ్ లిచ్చారు. సిటీ గురించి, వర్షాల వల్ల రాబోయే ముప్పు గురించి తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదనీ, 20వేల కోట్లతో మూడేండ్లలో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మనం మరింత ఘోరమైన వరదల్ని, విషాదాన్ని చూశాం. ఇన్నేళ్లలో ఏ మాత్రం మౌలిక వసతులు కల్పించినా చాలామంది ప్రాణాలు దక్కేవి. కనీసం నాలాల నిర్వహణ మెరుగైనా పసిబిడ్డ సుమేధ చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు. అక్టోబర్లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయి 40 మందికిపైగా చనిపోయారు. కొందరి డెడ్ బాడీలు దొరకడానికే రోజులు పట్టింది. ఇంత దారుణమైన పరిస్థితిని నగరానికి తెచ్చినందుకు కేసీఆర్ సర్కారులో కనీస పశ్చాత్తాపం లేదు. దానికి కొనసాగింపుగా వరద సాయం పేరుతో ఓట్ల కోసం వికృతమైన రాజకీయ క్రీడ ఆడారు. నేరుగా అకౌంట్లలో వేస్తే బాధితులందరికీ సాయం అందే అవకాశం ఉన్నా పైసలు పంచడం కోసమే జనాన్ని రోడ్ల మీదకు నెట్టారు. పేదల బతుకుల్ని గేలి చేశారు. గ్రేటర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ను అడ్డుపెట్టుకొని జనాన్ని రోడ్ల మీద క్యూల్లో నిలబెట్టి మరొకరి చావుకు కారణమయ్యారు. ఒక్కసారి తుగ్లక్ పాలనను గుర్తుచేసుకుంటే అన్నీ ఇలాంటి నిర్ణయాలే కనిపిస్తాయి.
ఆ తుగ్లక్ రాజధాని మారిస్తే.. ఈ తుగ్లక్..
రైతులు తాను చెప్పిన పంటలే వేయాలని కండీషన్లు పెట్టి, వేసిన పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా వాళ్ల ఉసురుపోసుకున్నారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా రిజిస్ట్రేషన్ల ఆన్లైన్ పేరుతో చేసిన హడావుడి 4 నెలల పాటు జనాలకు నరకం చూపించింది. ఎవరూ చేయని అద్భుతం అంటూ గొప్పలకు పోయి చేసిన నిర్వాకం వల్ల జనం ఇబ్బంది పడడం తప్ప ఏం సాధించారో కేసీఆర్కే తెలియాలి.
తుగ్లక్ దేశ రాజధానిని మార్చినట్లుగానే కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ ఆలోచనను చేశారు. రాష్ట్రంపై లక్ష కోట్ల రూపాయల అప్పును మోపడం, అటు కాంట్రాక్టర్లు, అందులో అక్రమాలతో తన కుటుంబం బాగుపడడం తప్ప ప్రజలకు ఏ మాత్రం మేలు చేయని కాస్ట్లీ ప్రయోగంగా కాళేశ్వరం నిలిచింది. ఓ దిక్కు ఆకాంక్షలు నెరవేరక అన్ని వర్గాలు ఆవేదనలో ఉంటే, ఇంకో దిక్కు కరోనా కారణంగా ఉద్యోగాలు, పనులు కోల్పోయి జనం కష్టాల్లో కూరుకుపోతే కేసీఆర్ ఆడంబరంగా వెయ్యి కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం తలకెత్తుకున్నారు. దీనికోసం విశాలమైన సెక్రటేరియట్ బిల్డింగ్ లను దుర్మార్గంగా కూలగొట్టారు. తన కుటుంబం, తన సన్నిహితులు బాగుపడడం, తన మూఢనమ్మకాలను పాటించడం కోసం జనం ఎట్లా చచ్చిపోయినా పట్టించుకోనని కేసీఆర్ పదేపదే నిరూపించుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలు తీర్చాలని సమ్మెకు దిగితే వారితో మాట్లాడి కొంతైనా న్యాయం చేయాలన్న ప్రయత్నం చేయకపోగా క్రూరంగా అణచివేయడానికి కుట్రలు చేశారు. సమ్మె కాలంలో జీతాల్లేక, కుటుంబాలు గడవక కార్మికులు గోసపడినా, 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినా కేసీఆర్ కనీసం మానవత్వం చూపలేదు. చివరికి వారిని అవమానించి, సంఘాలను రద్దుచేసి, నోరెత్తి మాట్లాడలేని స్థితికి నెట్టేశారు. ఇంత ఘోరమైన మనస్తత్వం తుగ్లక్ తర్వాత కేసీఆర్లోనే కనిపిస్తుంది.
నయా తుగ్లక్ పాలనపై తుది దశ ఉద్యమం
ఢిల్లీ సుల్తాన్ గా తుగ్లక్ రాచరికపు రోజుల్లో పెత్తనం చెలాయిస్తే… ఇప్పటి ప్రజాస్వామ్యం లో కూడా అలాంటి రాచరికాన్ని, ఆధిపత్యాన్ని సాగించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు చివరికి సొంత పార్టీ నాయకులు, మంత్రులు కూడా తనకు బానిసలుగా వంగి సలాములు చేస్తూ బతకాలని ఆయన భావిస్తున్ నారు. 1200 మంది బలిదానాలను అవమానిస్తూ పాలన సాగిస్తున్న ఆయన తన తీరుతో మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కేసీఆర్ పూర్వజన్మ మూలాల్లో తుగ్లక్ ఉండొచ్చుగానీ తెలంగాణ మట్టిలో, ప్రజల వారసత్వంలో ఉద్యమం, అలుపులేని పోరాటాలు ఉన్నాయి. తొలి దశ తెలంగాణ ఉద్యమాలు ప్రజల పోరాటస్ఫూర్తిని చాటితే మలిదశ ఉద్యమంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే మన పోరాటం అక్కడితో అయిపోలేదని కేసీఆర్ పాలన గుర్తుచేస్తోంది . ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం తుది దశ ఉద్యమం అవసరం ఉందని జనం ఇప్పుడే గుర్తిస్తున్నారు. అందుకే వరుస ఎన్నికల్లో బీజేపీని గెలిపించి తమ ఉద్యమానికి సరైన వేదికను నిర్మించుకుంటున్నారు. ప్రజల ఆకాం క్షలను దెబ్బతీస్తూ సాగుతున్న నయా తుగ్లక్ పాలనకు తెరపడినప్పుడే తెలంగాణ తుది దశ ఉద్యమం పూర్తవుతుంది .
చారిత్రక విధ్వంసం
తుగ్లక్ బాటలో కేసీఆర్ చేస్తున్న మరో దుర్మార్గం చారిత్రక విధ్వంసం. మన కాకతీయ సామ్రాజ్యాన్ని తుగ్లక్ ధ్వంసం చేసినట్లుగానే కేసీఆర్ కూడా మన చరిత్రను, వారసత్వ సాంస్కృతిక సంపదను నాశనం చేసే పనిలో ఉన్నారు. సెక్రటేరియట్ ను కూల్చేశారు. వందేండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ని కూల్చేసే దురాలోచనతో ఉన్నారు. కోర్టు ఆర్డర్ల పుణ్యాన ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ఎర్రమంజిల్ ప్యాలెస్ బతికిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే తుగ్లక్ మళ్లీ పుట్టాడన్న నమ్మకం బలపడుతోంది. తీరని కోరికలు, ప్రేమలు, పగలతో మళ్లీ పుట్టినవాళ్ల కథలను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. దాదాపు ఏడేండ్లుగా కేసీఆర్ పాలనను చూస్తుంటే ఇలాంటి కథ కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. – జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు
అంతా రివర్స్ రూట్లోనే.. తుగ్లక్ ను మరిపిస్తున్న కేసీఆర్
- వెలుగు ఓపెన్ పేజ్
- January 5, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ