కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు: వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి, వెలుగు : అవినీతి, అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడికి ఈడీ, సీబీఐ వెళ్తాయని, ఈ విషయాన్ని మరిచి మంత్రి కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రెస్మీట్లో కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని, అమెరికాలో చదువుకున్న ఆయన సంస్కారం ఇదేనా అని వివేక్ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శుక్రవారం ఓ వివాహ వేడుకకు హాజరైన వివేక్‌కు అక్కడి బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికి సన్మానించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్.. వాడు, వీడు అని మాట్లాడడం తెలంగాణ సంస్కారం కాదని ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో కూడా ప్రత్యర్థుల గురించి ఇలా మాట్లాడలేదని చెప్పారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. మీరేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం.. రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకొని ఆస్తులు పెంచుకున్నదని ఆరోపించారు. స్టేట్‌లో కల్వకుంట్ల రాక్షస పాలన నడుస్తోందని,ఈ పాలనను అంతం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధం అవుతున్నారని అన్నారు.
కమీషన్ల కోసమే బడ్జెట్
కమీషన్లు వచ్చే అంశాలపైనే దృష్టిపెట్టి కేసీఆర్ బడ్జెట్ ను తయారు చేయించారని వివేక్ విమర్శించారు. విద్యకు బడ్జెట్లో కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇరిగేషన్ పైనే ఫోకస్ పెట్టి కమీషన్ల దందాకు తెర లేపారన్నారు. ప్రాజెక్టుల కాస్ట్ పెంచుతూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇప్పుడు కవిత, రేపు కేటీఆర్, కేసీఆర్ కూడా సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కోక తప్పదన్నారు.
వివేక్‌కు టీచర్ల వినతి
తెలంగాణలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చారు. టీచర్లకు నెలనెలా జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల సమస్యలపై పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాత జహీరాబాద్ లో బీజేపీ బలోపేతంపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివేక్ వెంకటస్వామి దిశానిర్దేశం చేశారు.