- ఎస్సీలు, దళితులను ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలే?
- రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ విజయ నిలదీత
- బీజేపీ అభ్యర్థి గోమాసకు ఓటు వేయబోమని వెల్లడి
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రధాని మోదీకి నేతకాని కులం మీద ఇప్పుడు ప్రేమ పుట్టిందా అని రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం మహిళా విభాగం జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీటీసీ రాంటెంకి విజయ నిలదీశారు. నేతకాని సామాజికవర్గం, దళితులు, ఎస్సీలను మోదీ ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నేతృత్వంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మోదీని రామ మందిరం కట్టించిన గొప్పవాడని అంటున్నారని, మందిరం ఆయన సొంత డబ్బుతో కట్టించారా అని నిలదీశారు. ‘‘ఆపండి అంటున్నా ట్రస్టుకు కోట్ల రూపాయల డొనేషన్లు ఇచ్చిన ఎందరో మహానుభావులు ఉన్నారు. మన వంతు సాయం మనం చేసినం. మందిరం ఘనత మోదీ గొప్పేం కాదు. మందిరం ప్రారంభానికి ఎస్టీ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలే? ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద మోదీకి ప్రేముంటే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయకుండా ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చుపెట్టి ఉంటే దేశం బాగుపడేది’’ అని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నేతకాని అయినా ఆయనకు ఓట్లు వేయబోమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక్క రోజు కూడా తమ గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ‘‘నేతకాని కులస్తులం వెనుకబడిపోయామని, మా పరిస్థితి బాగా లేదని ఆదుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటే మా సమస్యను సీఎం రేవంత్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు.
మా సంఘం స్టేట్ గౌరవ అధ్యక్షుడు దుర్గం నరేశ్‌ను వెంటబెట్టుకొని వివేక్ సారు.. సీఎం రేవంత్ రెడ్డికి మా సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. నేతకాని కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని, నేతకాని భవనాన్ని నిర్మిస్తామని సీఎం హామీ ఇవ్వడానికి వివేక్ సార్ తీసుకున్న చొరవే కారణం. ఇందుకు వివేక్ సార్‌కు రుణపడి ఉంటాం” అని విజయ చెప్పారు. నేతకాని వాళ్లు మాట మీద ఉంటారని, ఈసారి తామంతా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా కాంగ్రెస్‌కు వేస్తామన్నారు.