మునుగోడుతో తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఒకప్పుడు సొంత ఇండ్లు కూడా లేని కేసీఆర్ కొడుకు, బిడ్డ... ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్ఏలు సమ్మె చేస్తోంటే కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అవినీతి సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని మండిపడ్డారు. విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు.

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచి పెట్టిండని విమర్శించారు. కోట్లు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు నిరూపయోగంగా మారాయని అన్నారు. అభివృద్ధి అనేది కేవలం సిద్ధిపేట, సిరిసిల్లకే పరిమితమైందన్న ఆయన... ఆ ప్రాంతాలకే నిధులను తరలిస్తున్నారని ఆరోపించారు. సమానత్వమంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్రంలో మలి దశ ఉద్యమం ప్రారంభమవుతుందన్న రాజగోపాల్ రెడ్డి... ఆ ఎన్నికతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.