భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ నక్సలైట్ కోడెం సమ్మయ్య ఆందోళనకు దిగాడు. పునరావాసం కింద ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని.. మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా కబ్జా చేశాడని ఆరోపించాడు. తన భూమిని తనకు ఇప్పించాలని లేని పట్ల తన చావుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ప్రతిఘటన పార్టీలో దళ కమాండర్‌గా పని చేశానని.. ప్రభుత్వ పిలుపు మేరకు 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయానని చెప్పాడు. జీవన భృతి కోసం ఇల్లందులోని ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద ఎకరం 20 కుంటల భూమిని ప్రభుత్వం సమ్మయ్యకు కేటాయించింది.
అయితే.. ఇటీవల జానీ పాషా తన భూమిని కబ్జా చేశాడని సమ్మయ్య ఆందోళనకు దిగాడు. తన భూమిని కబ్జా చేసి.. అక్కడ మామిడి తోట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2022 నవంబర్ 7న తన కుటుంబసభ్యులతో కలిసి మామిడి తోటను సమ్మయ్య ధ్వంసం చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత నెల రోజుల క్రితం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడి ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు మరోసారి.. తన భూమిని తనకు ఇప్పించాలని లేకపోతే తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని సమ్మయ్య నిరసన వ్యక్తం చేస్తున్నాడు.