ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: నిర్మల్​డీసీసీ మాజీ అధ్యక్షుడు పవార్​రామారావు పటేల్​ఈనెల 28న కాషాయ కండువా కప్పు కోనున్నారు. శనివారం ఆయన హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిశారు.  సంజయ్​ను సన్మానించారు. ముథోల్ నియోజకవరక్గం, జిల్లా రాజకీయాలపై చర్చించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర 28న  భైంసా నుంచి ప్రారంభంకానుంది. అదే రోజు స్థానికంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో రామారావు పటేల్ తన అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. కార్యక్రమంలో పార్టీ ఆదిలాబాద్​ పార్లమెంట్​ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, లీడర్లు రవి పాండే, గోపాల్​సార్డా, బి. గంగాధర్​ తదితరులు ఉన్నారు.

భైంసా మున్సిపల్​కమిషనర్​ సరెండర్

భైంసా,వెలుగు: భైంసా మున్సిపల్ కమిషనర్​ ఎంఏ అలీంను కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ గవర్నమెంట్​కు సరెండర్​చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్ల నిర్మాణాల పర్మిషన్లలో నిబంధనలు పాటించలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్​ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలమేరకు ఆయనను మున్సిపల్​అడ్మినిస్ట్రేటివ్​ఆఫీస్​కు అటాచ్​చేసినట్లు తెలిసింది. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్​కు భైంసా ఇన్​చార్జి కమిషనర్​గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్​ఉత్తర్వులు జారీచేశారు.

బహిరంగ సభను సక్సెస్​ చేయండి

భైంసా,వెలుగు: ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈనెల 28న భైంసాలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభను సక్సెస్​చేయాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్ కోరారు. శనివారం స్థానిక కాటన్​మార్కెట్ లో స్థలాన్ని పరిశీలించారు. ముథోల్ సెగ్మెంట్,​ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగ్రామ యాత్ర రూట్​ఇన్​చార్జి బాబుమోహన్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్​ చక్రవర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​ తాడేవార్ సాయినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్, లీడర్లు దిలీప్, రావుల పొశెట్టి, గాలి రవి, మల్లికార్జున్​రెడ్డి, బాలాజీ సూత్రావే తదితరులు ఉన్నారు.

వచ్చే ఏప్రిల్​లోగా సదర్మాట్​ కంప్లీట్​ కావాలి

నిర్మల్,వెలుగు:వచ్చే ఏప్రిల్​లోగా సదర్మాట్​బ్యారేజీ పనులు పూర్తికావాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో కలెక్టర్​ముషారఫ్​అలీతో కలిసి రివ్యూ నిర్వహించారు. కొన్ని పర్మిషన్ల కారణంగా బ్యారేజీ నిర్మాణం ఆలస్యమైందన్నారు. బ్యారేజీపై బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలన్నారు. సదర్మాట్​పూర్తయితే నిర్మల్​ సెగ్మెంట్​లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం 27వ ప్యాకేజీ కోసం ఇచ్చిన భూముల కోసం రూ.35 కోట్లు త్వరలో విడుదలవుతాయన్నారు. 28వ ప్యాకేజీ పనులు కాంట్రాక్టర్​ మధ్యలో వదిలేశాడని, ఏజెన్సీ మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు హేమంత్​బోర్కడే, రాంబాబు, ఇరిగేషన్ పాల్గొన్నారు.

‘స్వగృహ’ వేలం సక్సెస్​ చేశాం

ఆదిలాబాద్,వెలుగు: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం విజయవంతంగా పూర్తిచేశామని కలెక్టర్​సిక్తా పట్నాయక్​చెప్పారు. శనివారం చివరి రోజు స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్​లో నిర్వహించిన వేలంపాటకు ఆమె హాజరయ్యారు. ఇంటి స్థలాలు దక్కించుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తం 362 ప్లాట్లు వేలం వేయగా రూ. 97.14  కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, టీఎస్​ఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, హౌసింగ్​పీడీ బసవేశ్వర్, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, తహసీల్దార్లు సంధ్యారాణి, వనజ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ లీడర్ల దాడి హేయమైన చర్య

కాగజ్ నగర్,వెలుగు: నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ఇంటిపై టీఆర్ఎస్​లీడర్లు దాడిచేయడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్​ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కాగజ్​నగర్​లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఇంటికే రక్షణ లేకపోవడం దారుణమన్నారు.

మున్నూరుకాపులపై దాడులు సహించం

భైంసా,వెలుగు: మున్నూరుకాపులపై దాడులు సహించేది లేదని ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె హన్మాండ్లు హెచ్చరించారు. శనివారం భైంసాలోని కిసాన్ గల్లీ మున్నూరుకాపు సంఘం భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ఇంటిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం లీడర్లు రోళ్ల రమేశ్, గాలి రవి, పెండప్​కాశీనాథ్, కుంట కాశీనాథ్, తూమోళ్ల దత్తు, సాయినాథ్, మల్లేశ్వర్​తదితరులు ఉన్నారు.

అర్హులకే పోడు పట్టాలు ఇవ్వాలి

నర్సాపూర్(జి),వెలుగు: అర్హులైన ఆదివాసీ గిరిజనులకే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గొల్లమాడలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. శనివా రం రైతు వేదికలో 54 మందికి పోడు పట్టాలు అందజేశారు. ఆఫీసర్లు పట్టాలు ఇచ్చిన వారిలో అర్హులు లేరని ఆరోపించారు. రెవెన్యూ ఆఫీసర్లు సర్వేచేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. లేదంటే కలెక్టరేట్​ ముట్టడిస్తామని హెచ్చరించారు

మూడు గడ్డివాములు దగ్ధం

లక్ష్మణచాంద,వెలుగు: మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో  ఎద్దండి నవీన్, గణేశ్, లచ్చన్నలకు చెందినమూడు గడ్డివాములు, పెంట కుప్పలు కాలిపోయాయి. సర్పంచ్​సురకంటి ముత్యంరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.  ఈ ప్రమాదంలో ఓ ట్రాక్టర్​కూడా స్వల్పంగా
 కాలిపోయింది.

ఎంపీ అర్వింద్​ను పరామర్శించిన మోహన్​రావు పటేల్​

భైంసా,వెలుగు: నిజామాబాద్​ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్​ఎస్​లీడర్లు దాడిచేయడం హేయమైన చర్య​ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్​లో ఎంపీని పటేల్ పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.

గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం

లక్ష్మణచాంద,వెలుగు: మండలంలోని మునిపెల్లి వద్ద గల గోదావరి నదిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి అస్థి పంజరం కనిపించింది. స్థానిక రైతు బొడ్డు అశోక్ కట్టెల కోసం గోదావరిలో సంచరిస్తుండగా అస్తిపంజరం గుర్తించాడు. ఆయన సర్పంచ్ కమల్ కోట పద్మ వెంకట్ రెడ్డి ద్వారా స్థానిక ఎస్సై రాహుల్ కు సమాచారం ఇచ్చారు. గవర్నమెంట్​డాక్టర్ వేణుగోపాల్ అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. డెడ్​బాడీపై జీన్ ప్యాంట్, ఎర్ర రంగు లైన్​షర్టు ఉంది.

కరెంట్​ సమస్య పరిష్కరించాలి

ఖానాపూర్, వెలుగు: లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలని ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు డిమాండ్​చేశారు. శనివారం స్థానిక విద్యుత్​సబ్​స్టేషన్​ఎదుట ఆందోళన  నిర్వహించారు. ఎనిమిది నెలలుగా సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. నిరసనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, కాలనీవాసులు కిషన్, పరిమి శ్రీనివాస్, గంగాధర్, సతీశ్​రావు, రమేశ్, సంతోష్, ప్రణీత్, మురళి, శ్యామ్ తదితరులు ఉన్నారు.

28 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర

భైంసా, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 28న ముథోల్ సెగ్మెంట్ నుంచి ప్రారంభం అవుతుందని యాత్ర ఇన్​చార్జి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్  రెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానికంగా మాట్లాడారు. ముందుగా బండి సంజయ్​బాసరలో జ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారని, తర్వాత భైంసాలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం గుండెగాం, మహాగాం, కుంటాల మండలం, నిర్మల్, ఖానాపూర్ మీదుగా కరీంనగర్ వరకు సంజయ్​ పాదయాత్ర చేస్తారన్నారు. యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.

మా భూమి మాకు ఇప్పించండి

లోకేశ్వరం,వెలుగు: తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని, మా భూమి మాకు ఇప్పించాలని జోహార్​పూర్​దళితులు కోరారు. శనివారం డిప్యూటీ తహసీల్దార్​అశోక్​కు వినతి పత్రం అందజేశారు. జోహార్ పూర్ గ్రామానికి చెందిన గంగా, బద్దిగ, చిన్నక్క ముత్తాతల కాలం నుంచి సర్వే నంబర్​ 2/1ఎ, 2/1బి, 2/1/సి/ఇ సర్వే నంబర్​భూముల్లో వివిధ పంటలు సాగుచేసుకుంటున్నారు. అయితే ఈ భూములను సర్పంచ్​ కుమారుడు చిరుమణి దిగంబర్, ఆయన బంధువులు ఆక్రమించి ఎమ్మార్పీఎస్​జెండా పాతారని ఆరోపించారు. దౌర్జన్యంగా భూమికి అక్రమించారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

స్కూళ్లలో సౌలత్​లు బాగాలేవు

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి, కాసిపేట గురుకుల పాఠశాలలను శనివారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు తనిఖీ చేశారు. కాసిపేటలో 640 మంది చదువుకుంటున్నారని.. వారికి తగిన బెడ్స్ లేవని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బెడ్స్​సమకూర్చాలని ప్రిన్సిపల్ ఊటూరు సంతోష్ ను ఆదేశించారు. బాలికల రెసిడెన్షియల్ స్కూల్​లో మరుగుదొడ్లు, కిచెన్ క్లీన్​గా లేవని గుర్తించిన జడ్జి ప్రిన్సిపాల్ స్వరూపను మందలించారు. ఇట్ల ఉంటే బాలికలు రోగాల బారిన పడుతారని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలన్నారు. స్థానిక సమస్యలను జిల్లా న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జడ్జి వెంట తాళ్లగురిజాల ఎస్సై రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయి

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. శనివారం ఆయన స్థానిక హాస్టళ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. కనీస వసతులు లేక పేద విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన దుస్తులు, ఇతర సామగ్రి ఇంతవరకు అందలేదన్నారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు ముకుంద్, రాకేశ్​ తదితరులు ఉన్నారు.