- పాండియన్ విషయంలో నవీన్ పట్నాయక్ వివరణ
భువనేశ్వర్: తన సహాయకుడు వికె.పాండియన్ పై విమర్శలు రావడం దురదృష్టకరమని బిజూజనతాదళ్ (బీజేడీ) చీఫ్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఆయన అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమికి వికె.పాండియనే కారణమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విమర్శి స్తుండ టంతో నవీన్ పట్నాయక్ స్పందించారు.
‘‘వికె.పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకరం. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఏ పదవి తీసుకోలేదు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. నా వారసుడు వికె.పాండియన్ కాదని నేను చాలా సార్లు చెప్పాను. ఒడిశా ప్రజలే నా వారసుడిని నిర్ణయిస్తారు. ఇదే విషయం మరోసారి చెబుతున్నా. ఐఏఎస్ ఆఫీసర్ గా పాండియన్ గత పదేండ్లలో వివిధ రంగాల్లో అద్భుతంగా పని చేశారు. రెండు సైక్లోన్లు, కరోనా సమయంలో కూడా చాలా బాగా పని చేశారు.ఆ తర్వాత బ్యూరోక్రసీ నుంచి రిటైర్ అయ్యి బీజేడీలో చేరారు.
పాండియన్ నిజాయతీ కలిగిన వ్యక్తి. సమగ్రతకు మారు పేరు. అందుకు ఆయన్ను గౌరవించాలి. చాలా కాలం తర్వాత మా పార్టీ ఓటమిని చవి చూసింది. ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలు నా కుటుంబం. అధికారం లేకపోయినా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తా”అని చెప్పారు.