కోర్టు సంచలన తీర్పు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష

కోర్టు సంచలన తీర్పు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు  12 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌, మాజీ సారథి ఖలీద్ లతీఫ్‌కు నెదర్లాండ్స్ న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. డచ్ (నెదర్లాండ్స్)కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడిని హత్య చేసేందుకు ప్రేరేపించారన్న అభియోగాలపై అతనికి 12 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. లతీఫ్.. నెదర్లాండ్స్‌లో అరెస్ట్ కాకపోయినా, విచారణకు రాకపోయినా అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వటం గమనార్హం. 

ఏం జరిగిందంటే..?

2018లో గ్రీట్ విల్డర్స్ అనే డచ్ రాజకీయ వేత్త మహ్మద్ ప్రవక్త మీద కార్టూన్ బొమ్మలు వేసిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోటీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీనిపై ముస్లిం దేశాలలోని ప్రజలు భగ్గుమన్నారు. ఈ భయాలకు లొంగేది లేదన్న విల్డర్స్.. పోటీ నిర్వహించి తీరుతానని స్పష్టం చేశాడు. 

3 మిలియన్ పాకిస్తాని రూపీస్

ఆ సమయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ ఖలీద్ లతీఫ్‌.. విల్డర్స్‌ను  హత్య  చేసినవారికి 3 మిలియన్ పాకిస్తాని రూపీస్ (21వేల యూరోలు)  నగదు బహుమతి అందజేస్తానని ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అప్పట్లో ఈ విషయం పెనుదుమారం రేపింది. సామాజిక మాధ్యమాలలో ఎక్కడా చూసినా ఈ వీడియోపైనే చర్చ. అనంతరం పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విల్డర్స్ తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.

లతీఫ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే డచ్‌లో కేసు నమోదవ్వగా.. తాజాగా కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసు విచారణ ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిపోల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న హై-సెక్యూరిటీ కోర్టులో జరిగింది. అతను కానీ, అతని తరుపు న్యాయవాదులు కానీ ఎవరు హాజరు కాలేదు. ప్రాసిక్యూటర్లు కూడా అతని పేరు(లతీఫ్)కు బదులుగా.. ప్రసిద్ధ పాకిస్తాన్ క్రికెటర్‌గా వాదనలు వినిపించారు. హత్యకు ప్రేరేపించడం, దేశద్రోహం, బెదిరింపులకు పాల్పడ్డరన్న ఆరోపణలపై విచారణ జరిపిన డచ్ న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించదని రాయిటర్స్ తెలిపింది.

37 ఏళ్ల లతీఫ్ 2017లో నిషేధానికి గురయ్యాడు. 2017లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతడిపై 5 ఏళ్ల నిషేధం కొనసాగుతోంది. పాకిస్తాన్ తరపున 5 వన్డేలు,13 టీ20Iలు ఆడిన లతీఫ్ వరుసగా 147, 237 పరుగులు చేశాడు. 2010 ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.