అఫ్రిది టార్చర్ పెట్టేవాడు.. కనీసం తిండి కూడా తిననిచ్చే వాడు కాదు: పాక్ మాజీ స్పిన్నర్

అఫ్రిది టార్చర్ పెట్టేవాడు.. కనీసం తిండి కూడా తిననిచ్చే వాడు కాదు: పాక్ మాజీ స్పిన్నర్

పాకిస్తాన్ క్రికెట్‌లో వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ జరిగేవే. కాకపోతే ఇన్నాళ్లు వాటిని బయటపెట్టే ధైర్యం చేయకపోవడం వల్ల బయట ప్రపంచానికి తెలియలేదు. తాజాగా, ఆ వివాదాలన్నింటిని ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బయటపెట్టాడు. ముఖ్యంగా ఈ  మాజీ స్పిన్నర్.. ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదిపై సంచలన ఆరోపణలు చేశాడు. 

పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంత దారుణంగా ఉండేదో వివరించిన కనేరియా.. వెటరన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి పూస గుచ్చినట్లు వివరించాడు. 

"జట్టులో ఉన్నప్పుడు షాహిద్ అఫ్రిది వల్ల నేను చాలా వివక్ష ఎదుర్కొన్నా. అతడు, ఇతర ప్లేయర్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నాతో కలిసి వారు భోజనం కూడా చేసేవారు కాదు. మతం మారే విషయం గురుంచే నాతో మాట్లాడేవారు. ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉండిపోయేవాడిని. ఎందుకంటే నా మతమే నాకు సర్వస్వం. ఆ సమయంలో ఇంజమాముల్ హక్, షోయబ్ అక్తర్ మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు.." అని కనేరియా చెప్పుకొచ్చాడు.

 
పాకిస్తాన్ జట్టుకు ఆడిన తొలి హిందువు అనిల్ దళ్‌పత్ కాగా, రెండో హిందువు డానిష్ కనేరియా. పాక్ తరఫున అతడు 2000 నుంచి 2010 మధ్య 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 261 వికెట్లు, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2012లో అతనిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం.. అవి నిజమేనని అతడు అంగీకరించడంతో క్రికెట్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది.