
ఛాంపియన్స్ ట్రోఫీ వివాదాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర క్రికెట్ బోర్డులను రెచ్చగొట్టి భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ)పై ఒత్తిడి తెచ్చే కుట్రలు చేస్తున్నారు.
భద్రత విషయంలో ఇతర జట్లకు లేని ఇబ్బందులు ఒక్క భారత జట్టుకే ఎందుకని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. అంతేకాదు, ఇతర దేశాల క్రికెటర్లు తమ దేశానికి వచ్చి ఐపీఎల్ ఆడొచ్చని బీసీసీఐ చెప్తుంది కానీ, తమ క్రికెటర్లు రిటైర్ అయ్యే వరకు విదేశీ లీగ్‌ల్లో ఆడకుండా నిషేధిస్తున్న విధానాన్ని ఆయన హైలైట్ చేశాడు.
"ఇతర దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఐపీఎల్‌లో పాల్గొంటారు కానీ భారత ఆటగాళ్ళు ఇతర లీగ్‌లలో పాల్గొనరు. ఎందుకంటే బీసీసీఐ వారు రిటైర్ అయ్యే వరకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతించదు. ఇతర దేశాల విషయంలో ఈ నిబంధనలు వర్తించవు. ఇవాళ మాకు జరిగింది.. రేపు మీ వరకూ వస్తది. ఇకనైనా ఇతర దేశాల క్రికెట్ బోర్డులు మేల్కొనాలి. తమ ఆటగాళ్లను ఐపీఎల్(IPL)కు పంపడం ఆపాలి.." అని ఇంజమామ్ ఓ పాక్ టీవీ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
పాక్ మాజీ కెప్టెన్ మాటలు వాస్తవమే..!
ఇంజమామ్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ సహా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయితే తప్ప, భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. ఈ నిబంధనల వల్లే భారత క్రికెటర్లు.. బిగ్ బాష్, హండ్రెడ్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ వంటి ఫ్రాంచైజీ టోర్నీలో కనిపించడం లేదు.