
కరాచీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రెండు ఘోర ఓటములతో గ్రూప్ దశలోనే వైదొలిగిన పాకిస్తాన్ టీమ్‌పై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పోరులో ఇండియా చేతిలో చిత్తయిన జట్టుపై మాజీ ఆటగాళ్లు దుమ్మొత్తిపోస్తున్నారు. పాక్ జట్టులో సరైన విధానం, వైఖరి, ప్రణాళిక ఏదీ లేదన్న లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్.. 2026 టీ20 వరల్డ్ కప్‌నకు ముందు టీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
జట్టులోని ముగ్గురు పేసర్లు షాహీన్ ఆఫ్రిది, నసీమ్, రవూఫ్‌పై వేటు వేయాలని మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ డిమాండ్ చేశాడు. ‘ప్రస్తుతం పాక్ క్రికెట్‌లో సరైన వ్యవస్థ లేదు. సెలెక్టర్లు, పెద్దల అండతో జట్టులోకి వస్తున్న ఆటగాళ్లు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. మా దేశంలో ఒకే ఒక్క ఆట ఉండేది. అది క్రికెట్ మాత్రమే. కానీ, ఈ రోజు అది కూడా అంతం అయింది’ అని మాజీ ఓపెనర్ అహ్మద్ షెహ్‌జాద్ విమర్శించాడు.