సునక్ కేబినెట్​లోకి మాజీ ప్రధాని

లండన్‌‌: బ్రిటన్‌‌ ప్రధాని రిషి సునక్‌‌ తన కేబినెట్‌‌ నుంచి ఇంటీరియల్ మినిస్టర్ సుయెల్లా బ్రేవర్మన్‌‌ను సోమవారం తొలగించారు. ఆమె స్థానంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్న జేమ్స్‌‌ క్లెవర్లీని నియమించారు. అలాగే, బ్రిటన్‌‌ మాజీ ప్రధాన మంత్రి డెవిడ్‌‌ కామెరాన్‌‌ను కేబినెట్‌‌లోకి తీసున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. వీరి నియామకాలను బ్రిటన్‌‌ కింగ్‌‌ ఆమోదించారు. కాగా, లండన్‌‌లో ఇటీవల పాలస్తీనా మద్దతుదారులు చేసిన ర్యాలీలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బ్రేవర్మన్‌‌ తీవ్ర విమర్శలు చేశారు. 

నిరసనల పట్ల పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బ్రేవర్మన్‌‌ ఓ కథనాన్ని ప్రచురించారు. బ్రేవర్మన్‌‌ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, వెంటనే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని అధికార కన్జర్వేటివ్‌‌ పార్టీ నేతలు, ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేశాయి. దీంతో కేబినెట్‌‌ నుంచి తప్పుకోవాలని బ్రేవర్మన్‌‌ను ప్రధాని రిషి సునక్‌‌ ఆదేశించారు. ‘‘ఇంతకాలం హోమ్‌‌ సెక్రటరీగా పనిచేయడం నా జీవితానికి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి సంబంధించి నేను త్వరలో మరిన్ని విషయాలు చెబుతాను”అని బ్రేవర్మన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 ALSO READ : ఎస్సీల మీద ప్రధానికి ప్రేమ ఉంటే..వర్గీకరణకు ఆర్డినెన్స్ తేవాలె: ఆర్ ఎస్ ప్రవీణ్