మాజీ ప్రధాని.. ప్రపంచం గర్వించదగిన ఆర్థిక వేత్త.. భారతదేశాన్ని దివాళా నుంచి కాపాడి.. శక్తివంతమైన ఆర్థిక దేశంగా తీర్చిదిద్దిన మన్మోహన్ సింగ్ మరణంపై ప్రపంచ మీడియా మొత్తం స్పందించింది. ప్రతి దేశం తమ సంతాపం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు మన్మోహన్పై కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి.. ఏయే పత్రిక ఏ విధంగా ప్రస్తావించిందో తెలుసుకుందాం.
న్యూయార్స్ టైమ్స్: మన్మోహన్ సింగ్ మిత భాషి. మృదు స్వభావి. అమితమైన మేధస్సును మెదడులో నింపుకున్న నేత. ఆర్థిక సంక్షోభాల నుంచి తన దేశాన్ని కాపాడి, చైనాకు పోటీ ఇచ్చేంత స్థాయికి భారత్ను ఆర్థికంగా శక్తిమంతంగా అభివృద్ధి చేసిన శిఖరం మన్మోహన్.
అసోసియేటెడ్ ప్రెస్ : ఆర్థిక వేత్తల్లో విజనరీ.. ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని ఎలా గట్టెక్కించారు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఎలా పని చేస్తున్నాయి అని వివరించింది.
Also Read :- భారత్ గొప్ప నాయకున్ని కోల్పోయింది
వాషింగ్టన్ పోస్ట్ : భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం కావటం వెనక మన్మోహన్ సింగ్ పాత్ర అద్భుతం అని.. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. వాళ్లిద్దరి కలిసి 21వ శతాబ్దపు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ప్రసంశించింది. 2005 ఇండో.. యూఎస్ పౌర అణు ఒప్పందాన్ని హైలెట్ చేసింది.
రాయిటర్స్: విముఖత అంటే ఏంటో తెలియని రాజు మన్మోహన్ సింగ్ అని రాయిటర్స్ ఈ మృదు స్వభావిపై ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెంది పరుగుల తీయడానికి, మిలియన్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడటానికి కారణమైన వ్యక్తి మన్మోహన్ అని రాయిటర్స్ కొనియాడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వపు సవాళ్లను తట్టుకుని నిలబడిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ అని రాయిటర్స్ కీర్తించింది.
అల్ జజీరా: దోహాకు చెందిన అల్ జజీరా కూడా మన్మోహన్ నిష్క్రమణపై ప్రముఖంగా కథనం ప్రచురించింది. మీడియా, ప్రతిపక్షాల కంటే చరిత్ర(హిస్టరీ) తనపై ఎక్కువ కరుణ, ప్రేమ చూపిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నానని 2014లో ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. సౌమ్యమైన లక్షణం కలిగిన సాంకేతిక నిపుణుడిగా మన్మోహన్ సింగ్ను అల్ జజీరా గుర్తుచేసుకుంది.