
- మీడియాలో కథనాలు..ఖండించిన అనుచరులు.. స్పందించని కుంభం
యాదాద్రి, వెలుగు : ఇటీవల బీఆర్ఎస్లో చేరిన యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మళ్లీ సొంతగూటికి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో శనివారం జోరుగా కథనాలు ప్రసారమయ్యాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో విబేధాల కారణంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరిన సమయానికి బీఆర్ఎస్లో అభ్యర్థులను ప్రకటించలేదు. తర్వాత భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డినే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అప్పటి నుంచి కుంభం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జానారెడ్డి ఫోన్ చేశారని, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కుంభం భేటీ అయ్యారంటూ లీకులు వచ్చాయి. ఆ కథనాలను కుంభం ఖండించారు. తర్వాత కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నారని, ఢిల్లీకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో శనివారం కథనాలు వచ్చాయి. ఏ క్షణమైనా కుంభం ఢిల్లీకి వెళ్లే అవకాశముందంటూ బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మీడియాతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్నేతలు అనిల్‌కుమార్‌రెడ్డికి ఫోన్లు చేయగా.. ఆయన స్పందించలేదు. ఆయన అనుచరులు మాత్రం కుంభం బీఆర్ఎస్లోనే ఉంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.