మౌనముని కాదు.. కర్మయోగి

 మౌనముని కాదు.. కర్మయోగి

మన్మోహన్ సింగ్ మౌనముని కాదు.. కర్మయోగి.  ఆయన ఇప్పటిలాగ మాటల ప్రధాని కాదు చేతల ప్రధాని. ఆర్థిక సంస్కరణలతో దేశంలో మార్పులు తెచ్చిన విప్లవకారుడు. సమాచార హక్కులాంటి విప్లవాత్మక చట్టాలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు తనదైన శైలిలో కృషి చేసిన నిజమైన ప్రజాస్వామికవాది.  2009లో  మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ దాదాపు 11 గంటల పాటు క్లిష్టమైన సర్జరీ చేశారు.  

స్పృహ  వచ్చిన తర్వాత ఆయన భార్య, బిడ్డలు, కుటుంబం ఎవరినీ అడగలేదు. దేశం ఎలా ఉంది?  కశ్మీర్ ఎలా ఉంది?  ఇవీ..సర్జరీ తర్వాత  డాక్టర్లతో మన్మోహన్​ మాట్లాడిన తొలి మాటలు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంతే  స్వయంగా చెప్పారు. ఈ మాటలు దేశంపై ఆయనకున్న  ప్రేమకు నిదర్శనం.  

పాకిస్థాన్, ఇండియా  కోరుకుంటే  కశ్మీర్ అంశంపై  మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం అని అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా వ్యాఖ్యానించారు. ఇండియా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో  నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పక్కనే ఉన్నారు. అగ్రరాజ్యం  అధ్యక్షుడు ఎదురుగా ఉన్నా  ఏమాత్రం వెరవడలేదు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ‘కశ్మీర్ ఇండియాలో అంతర్భాగం’ అని.. ఈ అంశంపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.  జో బైడెన్​తో  జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్​కు ఒప్పుకోని చరిత్ర ఇప్పటి ప్రస్తుత ప్రధాని మోదీది.

పదేండ్ల కాలంలో జర్నలిస్టుల  ప్రశ్నలు ఎదుర్కొనే సత్తా లేని నేటి ప్రధాని మోదీ  ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే.. తన పదవీ కాలంలో 114 ప్రెస్ మీట్లలో పాల్గొన్న రికార్డు కూడా మన్మోహన్ సింగ్​ సొంతం. మరి స్టేజీలపై ఉపన్యాసాలు దంచికొడుతూ.. కొందరు సినిమా హీరోలతో ఇంటర్వ్యూ పేరుతో  భజన చేయించుకునే నేటి ప్రధానితో పోల్చితే మన్మోహన్ సింగ్  గొప్ప ప్రజాస్వామికవాదిగా కనబడతారు.  కాంగ్రెస్ అంటేనే పేదలు ఉన్నతి కోరుకునేది. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ ప్రధానులు చేసిన ప్రతి పని వీరి కోసమే.  తీసుకువచ్చిన ప్రతి చట్టం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికే. 

పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన ఉపాధి హామీ

మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం పల్లె పేదలకు ఎంతగా అండగా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే.  ప్రతి ఒక్కరికీ  కనీస వేతనంతో 100 రోజులు పని కల్పించి పల్లెల్లో పేదరిక నిర్మూలనలో ఈ పథకం పోషిస్తున్న పాత్ర అద్భుతం. ఉపాధి హామీ అంటూ తీసుకువచ్చిన ఈ పథకం పల్లెల్లో ఉపాధి విప్లవంగా మారింది.  

పేదలు పనికోసం ఎవరిపై  ఆధారపడకుండా  ఆత్మగౌరవంతో  బతికేలా ఈ స్కీమ్ దోహదపడింది. ఉపాధి హామీ పథకం కింద ఏ గ్రామంలోకి వెళ్లినా మరుగుదొడ్లు,  రోడ్ల నిర్మాణాలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే.  మన్మోహన్ సింగ్​ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ఇప్పటి కేంద్రప్రభుత్వ పెద్దలు.. ఇలాంటి పథకాన్ని ఏమైనా తీసువచ్చారో చెప్పాలి.  పల్లెలు, పట్టణాలను అందంగా మారుస్తామంటూ మోదీ  ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛభారత్ స్కీమ్ ఎంతవరకు వచ్చిందో కూడా వారు సమాధానం ఇవ్వాలి.

సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం..సమాచార హక్కు చట్టం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ తీసుకువచ్చిన మరో అస్త్రం సమాచార హక్కు చట్టం. మన్మోహన్ సింగ్  ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన విప్లవాత్మక చట్టాల్లో ఇదొకటి. ఈ యాక్ట్ ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది.  ప్రభుత్వ అధికారులు, పెద్దల్లో  జవాబుదారీతనాన్ని పెంపొందించింది. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంలా మారింది ఈ చట్టం.  దీనిద్వారా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అనేక స్కామ్​లు కూడా బయటపడ్డాయి. మీడియాకు కూడా ఈ చట్టం ఓ ఆయుధంలా మారింది. 

రైతులకు  మన్మోహన్ చేసిన మేలు నేటి పాలకులు చేశారా?

రుణమాఫీని  తొలిసారి అమలుచేసిన చరిత్ర నాటి మన్మోహన్ సింగ్ సర్కార్​ది.  2008లో  యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు  రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇదే స్ఫూర్తితో  తెలంగాణలో అధికారంలోకి  వచ్చిన  కాంగ్రెస్  ప్రభుత్వం  రైతులకు  రుణమాఫీ  చేసింది.  

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న అంశాన్ని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది.  గత  బీఆర్ఎస్  ప్రభుత్వం కూడా ఇలాంటి హామీని ఇచ్చి అమలు చేయలేకపోయింది.  రైతులపై కాంగ్రెస్​కు ఉన్న చిత్తశుద్ధి వారికి లేకపోవడమే ఇందుకు కారణం. ఉపన్యాసాలతో  ఊదరగొట్టడం కాదు.  దమ్ముంటే రైతులకు ఇంతలా మేలు చేసే కార్యక్రమాన్ని ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేపట్టగలరా?  బీజేపీ  తీసుకువచ్చిన  రైతు చట్టాలను వారే రద్దు చేసుకుని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఎవరు ఎక్కువ పాటుపడ్డారో దీన్నిబట్టి  అర్థం చేసుకోవచ్చు.  

ఆధార్ కూడా మన్మోహన్​ ఘనతే

కరెంట్,  గ్యాస్,  సిమ్ కార్డ్,  పాస్​పోర్ట్  చివరికి  కరోనా టెస్ట్,  వ్యాక్సిన్  ఇలా ఏది కావాలన్నా ఆధార్ కార్డే  ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి నెలకొంది.  నేడు అన్నింటికీ ఆధార్ కార్డే  ప్రామాణికం.  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిజిటలైజేషన్​ను  అందిపుచ్చుకుంటూ  భారత్  తీసుకుచ్చిన  ఆయుధం ఆధార్.  కేవలం గుర్తింపు కోసమే కాదు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో కూడా ఆధార్ కీలకంగా మారిన విషయం తెలిసిందే.

ఈ సింగిల్ కార్డుతో  అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో వృథా తగ్గిపోయింది.  అసలైన  లబ్ధిదారులకే  స్కీమ్స్ అందేలా ఈ కార్డు ఎంతగానో  దోహదపడుతోంది.  ఇంతటితోనే కాదు. ఈ డిజిటల్ యుగంలో శాంతిభద్రతల పరిరక్షణకు,  నేరస్తుల గుర్తింపుకు  కూడా  ఆధార్  ఎంతగా  ఉపయోగపడుతోందో  ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు.  మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌  హయాంలోనే  దేశంలో 3జీ,  4జీ సేవలు ప్రారంభం కావడం విశేషం.  నేడు టెలికాం రంగంలో వచ్చిన అనేక విప్లవాత్మక మార్పులకు బీజం పడింది కాంగ్రెస్ హయాంలోనే. 

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఉగ్రవాదంపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను తీసుకు వచ్చింది నాటి యూపీఏ ప్రభుత్వం.  దేశంలో ఉగ్రవాదుల కదలికలను డేగకన్నుతో పసిగట్టి వారికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ విజయాలు అనేకం.  ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమే.

 తీసుకువచ్చిన అనేక చట్టాలు ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన పెంపొందించేవే.  రైతు చట్టాలు, సీఏఏ,  ట్రిపుల్ తలాక్ నుంచి నేటి జమిలి ఎన్నికల బిల్లు వరకు ఎవరినీ ఒప్పించలేకపోయారు నేటి ప్రధాని మోదీ.  నాటి మన్మోహన్ సింగ్ సర్కార్ మాదిరిగా ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ,  విద్యాహక్కులాంటి చట్టాలను ఒక్కటైనా మోదీ ప్రభుత్వం తెచ్చిందా?  ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి  సమాచార హక్కులాంటి యాక్ట్​ల కోసం ప్రయత్నాలు చేసిందా? అని ప్రశ్నిస్తే సమాధానం లేదనే చెప్పాలి.  పదేండ్ల పాలనలో  ఎన్నో  సంస్కరణలు తీసుకొచ్చి దేశ ప్రజల కోసం నిరంతరం పాటుపడిన మన్మోహన్ సింగ్ మౌనముని కాదు. నిజమైన కర్మయోగి.

తెలంగాణ కల సాకారం

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది  మన్మోహన్ సింగ్ కాలంలోనే కావడం విశేషం. కేబినెట్ నోట్ దగ్గరి నుంచి బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతి విషయంలోనూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఉభయ సభల్లో  బిల్ పాస్ కావడంలో కీలక పాత్ర పోషించారు.  రాష్ట్ర ఏర్పాటును  అడ్డుకోవడానికి  సీమాంధ్ర నేతలు  ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన పట్టించుకోలేదు. సోనియా గాంధీ  తెలంగాణ  ప్రజలకు  ఇచ్చిన మాటను నిలబెట్టడమే లక్ష్యంగా ఆయన వ్యవహరించిన తీరును ఈ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరు.

-  పొన్నం ప్రభాకర్,తెలంగాణ రాష్ట్రరవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి-