మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్ బాదల్ కన్నుమూత

చండీగఢ్‌ : పంజాబ్‌ మాజీ సీఎం, శిరోమణి అకాళీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మంగళవారం (ఏప్రిల్ 25న) రాత్రి తుదిశ్వాస విడిచారు. బుధవారం (ఏప్రిల్ 26న) ప్రకాశ్‌ సింగ్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు ఆయన తనయుడు తెలిపారు. 

ప్రకాశ్‌ సింగ్ బాదల్‌  1927, డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్‌ ఖురానా గ్రామంలో జన్మించారు. బాదల్‌ కు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్. 

అప్పటి లాహోర్‌లోని ఫొర్మాన్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ విద్యనభ్యసించారు. గ్రామ సర్పంచ్‌గా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం సీఎంగా, దేశ రాజకీయాల్లో కీలక నేతగా ముద్రవేసుకొనే స్థాయికి చేరుకుంది. 

30 ఏళ్ల వయసులో 1957లోనే తొలిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 43 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ 5 సార్లు పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. చివరిసారిగా బాదల్‌ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.

ప్రముఖుల సంతాపం

ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.  దేశ రాజకీయాల్లో బాదల్‌ ఓ గొప్ప వ్యక్తి అని.. దేశానికి విశేష సేవలందించిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పంజాబ్‌ అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. క్లిష్టసమయాల్లో రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రకాశ్‌ సింగ్‌బాదల్‌ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని మోడీ పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయనతో సన్నిహితంగా మెలిగి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాదల్‌తో కలిసి ఉన్న ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. బాదల్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజకీయ దిగ్గజం ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ మృతిపట్ల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు.  సుదీర్ఘ రాజకీయ జీవితంలో బాదల్‌ రైతులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో  కృషి చేశారన్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు.

‘‘పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.