ప్రాణహిత నీళ్లకు పట్టుబట్టి..

కాకా వెంకటస్వామితో నా అనుబంధం జీవితాన్ని ప్రయోగాత్మకం చేసిన సుదీర్ఘ అనుభూతి. ఆర్యసమాజ్ సంస్కారం, హైదరాబాదీ షేర్వానీ షాన్ గల నేత కాకా వెంకటస్వామి. దక్కనీ ఇరానీ చాయ్ కు, పసిపిల్లల మాగీ నాస్తాకు మనసుపడేవారు కాకా. నేను ఆయనను మొదటిసారి1980లో కలిశాను. ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో ఆయన కార్మిక శాఖ మంత్రి. ఆయన అధికార నివాసం పక్కనున్న ‘ఈనాడు’లో రిపోర్టర్ గా నేను పని చేస్తుండేవాడిని. తెలుగు దేశం పుట్టుక, దాని హవా గురించి కొత్త ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే, తన రాజకీయ ప్రావీణ్యం కళ్లకు గట్టేది. మట్టి వాసన, సమాజ చైతన్యం తీరు పసిగట్టే ధారణ శక్తి నేర్చుకోవడానికి నాకు వీలుచిక్కేది. కలం నా చేతిలో ఉన్నా, అనుభవం తనకు కొట్టిన పిండి కావడం, నే చెప్పే కబుర్లు, ముసిముసి నవ్వులతో ఆయన వినడం, అతి చిన్న వయస్సులో జర్నలిస్టునైన నా ముక్కుసూటి మాటలు మా ఇద్దరిని బాగా దగ్గర చేశాయి. నా పుస్తక రచనలు, కాకా జాతీయ స్థాయి ఎదుగుదలకు మరో దశాబ్దం గడిచింది.

కాకా తీరు బాగా నచ్చేది
1993లో కాకా కేంద్రంలో మంత్రి. మా బాపు కాలం చేయడంతో నాలో కలిగిన అంతర్మథనం పరిణామం నా రాజకీయ రంగ ప్రవేశం. నిర్ణయం చేసుకున్నాకే విషయాన్ని కాకా చెవిలో వేశా. ‘జర్నలిజంలో బాగా ఎదిగావు కదా.. సలహా మండళ్లలో ఉండొచ్చు, నేరుగా వేళ్లు కాల్చుకోవడం ఎందుకు ?’ అని ఒకే ఒక్కసారి అని, నా మొండితనం చూస్తున్నవారే కావడంతో ‘సరే కానియ్, నీ పని నీవు చేయ్, నేను చేయగలిగింది నేను చేస్తా’ అనడం చకచకా జరిగిపోయాయి. 1994లో శాసన సభ ఎన్నికల్లో కాకా పీవీ సాబ్‌‌తో సరే అనిపించినా, టిక్కెట్ నాకు దక్కకపోవడంతో  నా పట్ల కాకాకు సంరక్షణ భావం పెరిగింది. అప్పటి మా పార్టీకి రాష్ట్ర శిక్షణ కార్యదర్శిగా విస్తారంగా కార్యకర్తల సమాయత్తం చేసేందుకు ఆయన పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ పరిధిలో వినూత్నంగా శిక్షణ కార్యక్రమం రూపొందించి, నిర్వహించడం సంచలనం. 1999లోనూ ఎమ్మెల్యే టికెట్ విషయంలో నాకు మొండి చెయ్యే చూపారు. దాంతో కాకాకు కసిపెరిగింది. పార్టీ పదవుల్లో, బాధ్యతల భారంతో దూసుకెళ్తుండటంతో కాకాకు ఎంతో ఆనందం కలిగేది. ఆ సమయంలోనే సముద్రం పాలవుతున్న ప్రాణహిత జలాలతో తెలంగాణకు సాగునీటి భద్రత కల్పించవచ్చని కాకా ప్రతిపాదన చేశారు. సాగునీటి ఇంజనీరింగ్ నిపుణులతో లోతైన చర్చలు జరిపారు. ప్రజాజీవితంలో నికరమైన ప్రజా సంక్షేమం సాధించాలంటే, కొత్త విషయాలు చిన్నవారైనా, అధ్యయనం చేసిన వారి నుంచి నేర్చుకోవాలనే కాకా పని తీరు నాకు బాగా నచ్చింది, అబ్బింది. అలా ప్రాణహిత పోరాటం క్రమంగా కదిలి ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపుదాల్చింది. 

కీలక మ్యానిఫెస్టో రూపకల్పన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఇప్పటి అధికార పార్టీకి ప్రణబ్‌‌ ముఖర్జీతో సంఘీభావం, ఎన్నెన్నో కార్యకలాపాలు జరిగాయి. 2004 శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీకి కాకా చైర్మన్​గా వ్యవహరించారు. నేను మెంబర్​సెక్రటరీని. ఆ మ్యానిఫెస్టో రూపకల్పన తీరు దేశంలోనే వినూత్నం. దాని పట్ల ప్రజల్లో, కార్యకర్తల్లో స్పందన చరిత్రాత్మకం. ఇలా ఎన్నో విజయానుబంధాలు కాకాతో నాకున్నాయి. నా రాజ్యసభ ప్రవేశానికి కాకా ఎంతగా మురిసిపోయారో మాటల్లో వివరించలేను. సభలో నా ఉపన్యాసాలను టీవీలో చూసి నన్ను ప్రోత్సహించిన తీరు, ఒక మొలకను ఎలా పెంచాలో నేర్పే పాఠం నేను మరవలేనిది. కాకతో నా జ్ఞాపకాలు విస్తారం. భారత రాజకీయాల్లో ధురంధరులైన కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా నా వినమ్ర శ్రద్ధాంజలి.
- రాపోలు ఆనంద భాస్కర్
రాజ్యసభ మాజీ సభ్యుడు